కడప: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయాల్సింది ఇక్కడ కాదు, ఢిల్లీలో అని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అన్నారు. కడప ఉక్కు కర్మాగారం కోసం దీక్ష చేస్తున్న సిఎం రమేష్ ను పరామర్శించిన తర్వాత ఆయన మాట్లాడారు. దమ్ము ధైర్యం ఉంటే ప్రధాని మోడీని నిలదీయాలి, చంద్రబాబును కాదని ఆయన జగన్ ను నిలదీశారు. 

ఢిల్లీ వీధుల్లో పాదయాత్ర చేసి సమస్యలను జగన్ అక్కడ చెప్పాలని ఆయన అన్నారు. సొంత జిల్లాకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని ఆయన జగన్ ను ప్రశ్నించారు. జగన్ అన్ని విషయాలు మాట్లాడుతారు గానీ కడప ఉక్కు కర్మాగారం గురించి మాట్లాడడం లేదని అన్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్క్రిప్టు, స్క్రీన్ ప్లే రాసిస్తే జగన్ నటిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 

రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆరు నెలల్లో ఉక్కు కర్మాగారం మంజూరు చేయాలని చట్టంలో పొందుపరిచారని, నాలుగేళ్లయినా ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదని, కేంద్రం న్యాయం చేస్తుందని నాలుగేళ్లు తాము ఓపిక పట్టామని లోకేష్ అన్నారు. 

ఉక్కు ఫ్యాక్టరీ కోసం తమ నేతలు సిఎం రమేష్, బిటెక్ రవి దీక్షలు చేస్తుంటే వైసిపి ఎంపీలు రాజీ పడ్డారని ఆయన అన్నారు. కడప జిల్లాలో గెలిచిన వైసిపి ఎంపీలు స్టీల్ ప్యాక్టరీ కోసం పోరాటం చేశారా.. లేదు అని ఆయన అన్నారు.  ఉక్కు ఫ్యాక్టరీపై కేంద్రాన్ని జగన్ ఒక్క మాట కూడా అనడం లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపికి 25 ఎంపీ సీట్లు గెలిపించి ఇస్తే ప్రధాని ఎవరో చంద్రబాబు నిర్ణయిస్తారని అన్నారు. అప్పుడు ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధిస్తామని ఆయన అన్నారు.