మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పై రెచ్చిపోయారు. చంద్రబాబును ఉద్దేశించి అమిత్ షా రాసిన లేఖపై ఆవేశంగా స్పందించారు.

ఆంధ్రప్రదేశ్‌ సమస్యలపై అమిత్‌ షాకు ఏ మాత్రం అవగాహన లేదని, కనీస సమాచారం లేకుండా ఆయన ఏవేవో మాట్లాడుతున్నారని లోకేశ్ మండిపడ్డారు. ‘‘రాజకీయ దురుద్దేశాలతోనే ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలిగిందని, అభివృద్ధి ఎజెండాతో కాదని అమిత్‌ షా అనడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో జరిగిన అన్ని పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు యూసీ సర్టిఫికేట్లను కేంద్రానికి పంపుతూవచ్చామని చెప్పారు.

ఎన్డీఏ నుంచి వైదొలగాలన్న టీడీపీ నిర్ణయం ఆవేశంలో తీసుకున్నది కాదని లోకేశ్‌ వివరించారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ప్రధాని దృష్టికి తెచ్చేందుకే  కేంద్ర మంత్రి పదవులకు రాజీనామాలు చేశారట. మంత్రివర్గం నుండి తప్పుకున్నా టీడీపీ ఎన్డీఏలో కొనసాగుతామని చెప్పారట. అమిత్‌ షా ఆరోపణలు అన్నింటికీ ఆధారాలతో సహా తమ అధ్యక్షుడు చంద్రబాబు ఇంకో లేఖ రాస్తారని చెప్పారు.