2019 ఎన్నికల్లో 2 వేల కోట్ల ధనప్రవాహం : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వ్యభిచారం సాగుతోంది : కొణతాల

konataala ramakrishna shocking comments on present politics
Highlights

బయోడెటా చూసి కాదు...బ్యాలెన్స్ షీట్ చూసే పార్టీల టికెట్ 

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రాజకీయ వ్యభిచారం జరుగుతోందని సీనియర్ నాయకులు కొణతల రామకృష్ణ విమర్శించారు. ఇందులో భాగంగానే బ్యాంకుల్లో నగదు నిల్వలు తగ్గిపోయి నోట్ల కొరత ఏర్పడిందని అన్నారు. ఇలా కొన్ని రాజకీయ పార్టీలు డబ్బులు దాచి, 2019 ఎన్నికల్లో పంచడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇలా 2019 ఎన్నికల్లో దాదాపు 2 వేల కోట్ల ధనం ప్రవహించినున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి రాజకీయ పార్టీ తమ సిద్దాంతాలను పక్కనపెట్టి ఇలా డబ్బులు పంచే సామర్థ్యమున్న వారికే టికెట్లు ఇస్తున్నాయని ఇది రాజకీయ వ్యభిచారం కాక ఇంకేంటని ఆయన ప్రశ్నించారు.  

ఇక డబ్బులు పంచే వారే కాదు వాటిని స్వీకరించే ప్రజలు కూడా ద్రోహులేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  ఇలా నోట్లకు ఓటు వేయడం అంటే అవినీతికి లైసెన్స్‌ ఇవ్వడమేనంటూ కొణతాల పేర్కొన్నారు.  ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయాలంటే బయోడేటా కాకుండా బ్యాలెన్స్‌ షీట్‌ చూపించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. అందువల్లే మార్పు ప్రజల నుండి ప్రారంభం కావాలని అన్నారు.

ఇక ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలంటే యువత విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి రావాలని అన్నారు. ఇలా వచ్చిన విద్యర్థి నాయకులే గొప్ప స్థానాల్లో ఉన్నారని గుర్తు చేశారు. దివంగత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, ఉప రాష్ట్రపతి ​​​​​​వెంకయ్య నాయుడు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి, సీఎం కేసీఆర్‌ వంటి వారు ఇలా విద్యార్థి దశ నుండే రాజకీయాల్లోకి వచ్చి ఉన్నత స్థానాలకు చేరుకున్నారని పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం యువత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని, ఇది చాలా ప్రమాదకరమని అన్నారు. 

ఇక ప్రస్తుత రాజకీయ నాయకులు ప్రజాసేవకోసం కాకుండా అత్యంత లాభదాయకమైన వ్యాపారంగా రాజకీయాలను మార్చారని కొణతాల మండిపడ్డారు. ఇలాంటి రాజకీయ నాయకులు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండటం చాలా దురదృష్టకరమని రామకృష్ణ విచారం వ్యక్తం చేశారు.
 
 

loader