విజయవాడ: ట్విటర్‌ వేదికగా విజయవాడ తెలుగుదేశం పార్టీ నేతలు కేశినేని నానికి, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. బుద్ధావెంకన్నపై కేశినేని నాని మరోసారి పరోక్షంగా ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. రాజకీయ జన్మలు, రాజకీయ పునర్జన్మలు, రాజకీయ భవిష్యత్తులు గుళ్లో కొబ్బరిచిప్ప దొంగలకు, సైకిల్‌ బెల్లుల దొంగలకు, కాల్‌మనీగాళ్లకు, సెక్స్‌ రాకెట్‌గాళ్లకు, బ్రోకర్లకు, పైరవీదారులకు అవసరమని.. తనకు అవసరం లేదని కేశినేని నాని ట్వీట్ చేశారు. 

అంతకుముందు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను ఉద్దేశించి కేశినేని నాని పరోక్షంగా ట్వీట్‌ చేశారు. "నాలుగు ఓట్లు సంపాదించలేని వాడు..నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేని వాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్‌ చేస్తున్నారు.. దౌర్బాగ్యం" ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 

గతకొద్దిరోజుల నుంచి బుద్ధా వెంకన్న ట్వీటర్‌లో చురుగ్గా ఉన్న నేపథ్యంలో కేశినేని నాని  ఆయనను లక్ష్యం చేసుకుని ఆ ట్వీట్‌ చేసినట్టు ప్రచారం జరిగింది. ఈ ‍ట్వీట్‌కు బుద్దా వెంకన్న కూడా కౌంటర్ ఇచ్చారు. 

"సంక్షోభం సమయంలో పార్టీ కోసం.. నాయకుడి కోసం పోరాడేవాడు కావాలి. ఇతర పార్టీ నాయకులతో కలిసి కూల్చేవాడు ప్రమాదకరం. నీలాగా అవకాశవాదులు కాదు. చనిపోయేవరకూ చంద్రబాబు కోసం సైనికుడిలా పోరాడేవాడు కావాలి" అని ట్వీట్‌ చేశారు.