విజయవాడ: హైదరాబాదు వెళ్లగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఫోన్ చేస్తానని, కృతజ్ఞతలు తెలియజేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పారు. దుర్గమ్మ దర్శనం బాగా చేయించినందుకు ఆయన ఎపి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కనకదుర్గ దర్శనం తర్వాత ఆయన మాట్లాడారు. ఆముదాలవలస సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారని సిఎంవో అధికారులు చెప్పారని ఆయన గుర్తు చేశారు.

మళ్లీ ముఖ్యమంత్రిగా వచ్చి అమ్మవారికి మొక్కలు తీర్చుకుంటానని చెప్పారు. విజయవాడ బాగా అభివృద్ధి చెందిందని అన్నారు. విమానాశ్రయం కూడా బాగుందని కొనియాడారు. బందర్ రోడ్డును బాగా విస్తరించారని, ఎయిర్‌పోర్టు నుంచి బందరు రోడ్డు వరకు గ్రీనరీ బాగుందని అన్నారు. రోడ్డుకు ఇరువైపులా పెయింటింగులు కూడా బాగున్నాయని తెలిపారు.
 
తాను రవాణా మంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ బస్టాండ్ నిర్మించామని గుర్తుచేశారు. ఆసియాలోనే పెద్ద బస్టాండ్‌గా ఉండాలని ఎన్టీఆర్ అన్నారని చెప్పారు. బస్టాండ్ పనులను పరిశీలిందుకే పలుమార్లు విజయవాడ వచ్చానని చెప్పారు. దుర్గగుడి బాగా మారిపోయిందని అన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు కేసీఆర్‌కు కొండపల్లి బొమ్మను బహూకరించారు. కొండపల్లి, ఇబ్రహీంపట్నంతో పాటు పవిత్రసంగమం తన నియోజకవర్గంలోనే ఉందని దేవినేని ఉమ చెప్పారు.