కడప: తాను ప్రేమించిన ప్రొఫెసర్ ను వివాహం చేసుకోవడానికి ఓ యువతి తనను కిడ్నాప్ చేశారని, అత్యాచారానికి ప్రయత్నించారని తప్పుడు సమాచారాన్ని ఇచ్చింది. ఈ సమాచారం తప్పని తెలవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకొన్నారు. మరోవైపు  తాను ప్రేమించిన అధ్యాపకుడిని వివాహం చేసుకొన్న విషయాన్ని ఆ యువతి వాట్సాప్ మేసేజ్‌ల ద్వారా స్నేహితులకు సమాచారం ఇచ్చిందని పోలీసులు తెలిపారు.అయితే ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

కడప నగరంలో సంచలనం సృష్టించిన యువతి కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది.  ప్రేమ వివాహం చేసుకొనేందుకే ఆ యువతి కట్టుకథ అల్లిందని పోలీసులు అనుమానిస్తున్నారు. తనను ఎవరో కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేశారని  వాట్సప్‌లో మెసేజ్‌లు పెట్టి అందరిని టెన్షన్‌కు గురి చేసింది. 

 మంగళవారం నాడు ఇంటికి వెళ్లిన యువతి పథకం ప్రకారంగా బురఖా ధరించి బస్సులో కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డకు చేరుకొంది. ఆళ్లగడ్డలో అప్పటికే ఆమె ప్రియుడు తాను పనిచేసే కాలేజీలో ప్రొఫెసర్ ఎదురు చూస్తున్నాడు. యువతి బస్సు దిగగానే  ఆ యువతితో కలిసి హైద్రాబాద్‌ వెళ్లారు.

హైద్రాబాద్ ఆర్యసమాజ్‌ పక్కనే ఉన్న గుడిలో వీరిద్దరూ  వివాహం చేసుకొన్నారు.తమ పెళ్లి ఫొటోలను వాట్సప్‌లో పోలీసు అధికారులకు, స్నేహితులకు పంపించారు. అంతేగాక తాను ఎవరి బలవంతంతో వెళ్లలేదని తన ఇష్టపూర్వకంగానే వెళ్లి వివాహం చేసుకున్నానని వీడియో కూడా పంపించింది. తన కోసం ఎవరూ వెతకొద్దని కూడా మెసేజ్‌ ద్వారా తెలిపింది.

కిడ్నాప్‌కు గురైనట్టు ప్రచారమైన యువతి వివాహం  చేసుకొన్నట్టుగా తమకు సమాచారం వచ్చిందని సీఐ రామకృష్ణ చెప్పారు. యువతి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు ఆయన తెలిపారు.