తెలుగు రాష్ట్రాల్లో సంచనలం సృష్టించిన ఐటీ దాడుల వ్యవహరంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎట్టకేలకు స్పందించారు. చంద్రబాబు పీఎస్ ఇంట్లో జరిగిన ఐటీ దాడులపై మీరెందుకు స్పందించరంటూ వైసీపీ వ్యాఖ్యలకు ఆయన కౌంటరిచ్చారు.

ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పర్యటించిన పవన్ కల్యాణ్.. అలాంటి అవినీతిని తామెప్పుడూ ప్రొత్సహించమన్నారు. డబ్బుతో ఓట్ల రాజకీయం చేయలేకపోవడం వల్లే జనసేన ఇప్పుడు ఇబ్బందులు పడుతోందని పవన్ గుర్తుచేశారు.

Also Read:టికెట్ కోసం రికమండేషన్ అడిగి.. ఇప్పుడు నామీదే తిట్లు: వైసీపీ ఎమ్మెల్యేపై పవన్ వ్యాఖ్యలు

నోట్లకు ఓటును అమ్ముకోవడం వల్లే ప్రజలు కూడా నాయకులను ప్రశ్నించే అధికారం కోల్పోయారని పవన్ అన్నారు. తెలుగుదేశం పార్టీ పాలనలో అవినీతి గురించి మంగళగిరి సభలోనే లేవనెత్తిన విషయాన్ని జనసేనాని గుర్తుచేశారు.

అదే సమయంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. జగన్‌పై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బులు లేకుండా రాజకీయాల్లో గెలిచిన వారి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయన్నారు.

ఢిల్లీలో డబ్బులు ఇచ్చి గెలవలేదు.. ఐడియాలజీతో గెలిచారని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. తనకు జగన్మోహన్ రెడ్డి లాగా మైన్స్ లేవని.. తనపై భీమవరంలో గెలిచిన గ్రంధి శ్రీనివాస్ మాదిరి ఆక్వా బిజినెస్ లేదన్నారు.

స్వశక్తి మీద బతకడానికి తనకు సినిమాలు ఉన్నాయని.. ఈజీగా గెలవాల్సిన సీటు తాడేపల్లిగూడెమన్నారు. నేరస్తులు నడిపే రాజకీయ పార్టీలను చూసి, ఏదో చేయాలని పార్టీ పెట్టానని జనసేనాని గుర్తుచేశారు.

Aslo Read:బీజేపీతో వైసీపీ జత కలిస్తే జనసేన కటీఫ్: తేల్చేసిన పవన్

తనను కులం చూసి కాకుండా.. సిద్ధాంతాలను చూసి ఇష్టపడాలని కల్యాణ్ పిలుపునిచ్చారు. రెండు కులాల మధ్య రాష్ట్రం విచ్ఛిన్నమవుతుందన్న మాట వాస్తవమన్నారు. బాధ్యతగల రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందని.. తనకు రెండు చోట్ల పోటీ చేయడం ఇష్టం ఉండదని పవన్ తెలిపారు.

అయితే గత ఎన్నికల్లో పార్టీ నేతలు సూచించడం వల్లే రెండు చోట్ల పోటీకి దిగానని పవన్ కల్యాణ్ వెల్లడించారు. గత ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేయాలనుకున్నానని కానీ కుదరలేదని.. ఈసారి మాత్రం అక్కడి నుంచి పోటీపై పరిశీలిస్తానని పవన్ తెలిపారు.