అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 

"ఇంత బతుకు బంతికి ఇంటెనక... అన్నట్లుగా ఉంది చంద్రబాబు పరిస్థితి. తన దోపిడీ వ్యవహారాల గుట్టంతా మాజీ పీఎస్ శ్రీనివాస్ వద్ద ఉన్నట్లు ఐటి దాడుల తర్వాత క్లియర్ గా అర్తమైంది. మానిప్యులేషన్ తో వ్యవస్థలను చెరబట్టిన వ్యక్తి చివరకు శ్రీనివాస్ అనే ఉద్యోగి వద్ద తన పాస్ వర్డ్ వదిలేశాడు" అని ఆయన వ్యాఖ్యానించారు. 

 

"బాబు మాజీ పిఎస్ శ్రీనివాస్ కమిట్ మెంట్ ను మెచ్చుకోవాలి. యజమాని ప్రతి లావాదేవీని డైరీలో రాసుకున్నాడు. కంప్యూటర్ లో నిక్షిప్తం చేశాడు. ఇంకా అప్పగించాల్సిన పద్దులను అలాగే దాచి ఉంచాడు. దోచుకున్నవి దొంగదారుల్లో పంపిన లెక్కలన్నింటినీ ఫర్ఫెక్ట్ గా రికార్డు చేశాడు" అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ నివాసంపై ఐటి అధికారులు ఐదు రోజుల పాటు దాడులు చేసి కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి ఆ ట్వీట్లు చేశారు.