అమరావతి: ఇటీవల జరిగిన గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానంలో టీ.కల్పలత విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పిడిఏ(ప్రొగ్రెసివ్ డెమోక్రాటిక్ అలియన్స్) అభ్యర్థి బొడ్డు నాగేశ్వరరావుపై ఇండిపెండెంట్ అభ్యర్థి కల్పలత గెలుపొందారు. విజయానికి కావాల్సిన 50 శాతం ఓట్లు దాటడడంతో ఆమె విజయం సాధించారు. 6,153 ఓట్లు దాటగానే కల్పలత గెలిచినట్లు అధికారులు ప్రకటించారు.

ఈ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీచేయగా 12,554 మంది టీచర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో చెల్లని ఓట్లు పోగా విజయానికి 6,153 ఓట్లు అవసరమని అధికారులు నిర్ణయించారు. అయితే తొలి ప్రాధాన్య ఓట్లలో ఏ అభ్యర్థికి 6,153 ఓట్లు రాకపోవడంతో ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టగా కల్పలతను విజేతగా నిలిచారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు అధికారిక ప్రకటన కూడా చేశారు. 

ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ అభ్యర్ధి విజయం సాధించారు. 1,537 ఓట్ల మెజారిటీతో యూటీఎఫ్ అభ్యర్ధి షేక్ సాబ్జీ గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 14వ తేదీన ఉభయ గోదావరి, కృష్ణా–గుంటూరు జిల్లాలకు సంబంధించి జరిగిన రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు బుధవారం ఉదయం 8గంటలకి లెక్కింపు మొదలైంది. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఓట్లను కాకినాడ జేఎన్‌టీయూ కాలేజీలోను, కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఓట్లను గుంటూరు ఏసీ కాలేజీలోను లెక్కించనున్నారు. ఎన్నికల కౌంటింగ్‌కు మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు.