చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన చిన్నారిపై అత్యాచారం, ఆమె హత్య కేసులో దోషి రఫీకి హైకోర్టు ఊరట కలిగించింది. అతనికి విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మారుస్తూ తీర్పు చెప్పింది. గతంలో చిత్తూరు స్థానిక కోర్టు అతనికి మరణశిక్షను విధించింది. దీంతో కింది కోర్టు తీర్పును రఫీ హైకోర్టులో సవాల్ చేశాడు. 

2019 నవంబర్ 7వ తేదీన చిత్తూరు జిల్లా కురబలకోట మండలం చేనేతనగర్ లోని ఓ కల్యాణ మండపానికి తల్లిదండ్రులతో పెళ్లికి వెళ్లిన చిన్నారి వర్షితపై అత్యాచారం చేసి రఫీ హత్య చేశాడు. చిన్నారిపై వర్షితపై దాడికి పాల్పడిన నిందితుడిని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. మదనపల్లె మండలం బసినికొండ గ్రామానికి చెందిన లారీ క్లీనర్ మహమ్మద్ రఫీ నేరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. 

రఫీని పోలీసులు నవంబర్ 16వ తేీదన అరెస్టు చేశారు. మృతురాలి పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా, తాము సేకరించిన ఆధారాలతో పోలీసులు కోర్టుకు సాక్ష్యాలను సమర్పించారు. హత్య జరిగిన 17 రోజుల్లో పోలీసులు కేసులో చార్జిషీట్ దాఖలు చేశారు. 

బి కొత్తకోట మండలం గట్టు పంచాయతీ గుట్టపాలెంకు చెందిన సిద్ధారెడ్డి, ఉషారాణి దంపతుల కూతురు వర్షిత. ఈ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. వైష్ణవి, వర్షిణి, వర్,ిత. 2019 నవంబర్ 7వ తేదీన అంగల్లు సమీపంలోని చేనేత నగర్ లో గల కల్యాణ మండపంలో బంధువుల పెళ్లి ఉండడంతో సిద్ధారెడ్డి కుటుంబం అక్కడికి వెళ్లింది. 

కల్యాణ మండపంలో ఆడుకుంటున్న వర్షిణి అదే రోజు రాత్రి 10 గంటలకు కనిపించకుండా పోయింది. చిన్నారి కోసం కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల గాలింపులో కల్యాణ మండపానికి సమీపంలోని నిర్మానుష్యమైన ప్రదేశంలో చిన్నారి మృతదేహం లభ్యమైంది. 

రఫీని నిందితుడిగా గుర్తించి అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న రఫీ ప్రవర్తన బాగా లేకపోవడంతో భార్య వదిలేసి వెళ్లిపోయింది. ఓ కేసులో రఫీ రెండు నెలలు జైలులో ఉండి వచ్చాడు.