గుంటూరు జిల్లా మంగళగిరిలో డ్రగ్స్ కలకలం రేపాయి. మంగళగిరి కేంద్రంగా గంజాయి, మత్తు పదార్థాలు రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. స్కూల్, కాలేజీకి వెళ్లే విద్యార్థులే టార్గెట్ గా గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

ఓ కార్పొరేట్ కాలేజీలో ఈ గంజాయి వ్యవహారం  ముందుగా వెలుగులోకి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. అనుమానితులుగా భావించిన నలుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారంతా గంజాయి తీసుకున్నారనే అనుమానంతో వారి రక్త నమూనాలు సేకరించినట్లు పోలీసులు చెప్పారు. ఆ పరీక్షల ఫలితం ఆధారంగా విద్యార్థులపై కేసులు నమోదు చేసే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. 

ఇదిలా ఉండగా.. రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరంలో కూడా డ్రగ్స్ కలకలం రేగింది. ఈ డ్రగ్స్ కేసులో పలువురు సినీ ప్రముఖుల పేర్లు కూడా వినిపించాయి. అంతేకాకుండా కొన్ని స్కూల్స్,  కాలేజీ విద్యార్థులకు కూడా డ్రగ్స్ సరఫరా చేశారనే వార్తలు వినిపించాయి. ఇప్పటి వరకు ఈ కేసును తెలంగాణ పోలీసులు పూర్తిగా తేల్చలేదు. 

తెలంగాణలో డ్రగ్స్‌ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏడు చార్జీషీట్లు దాఖలు చేసినట్టుగా ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. మరో ఐదు చార్జీషీట్లు దాఖలు చేయనున్నట్టు సిట్ అధికారులు ప్రకటించారు. సినీ ప్రముఖులకు ఈ కేసులో క్లీన్ చిట్ ఇవ్వలేదని తేల్చి చెప్పింది.

సినీ ప్రముఖుల నుండి సేకరించిన శాంపిళ్లకు సంబంధించిన ఎవిడెన్స్‌ను పోరెన్సిక్ నుండి వచ్చిందని సిట్ ప్రకటించింది. డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నవారెవరినీ కూడ తాము  వదలబోమని కూడ  సిట్ తెలిపింది. ఇప్పుడు తాజాగా.. ఏపీలో కూడా డ్రగ్స్ వార్తలు రావడం తీవ్ర కలకలం రేగింది. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.