సినిమా డైలాగ్‌లు కొట్టి ఇంటికెళ్తారు,పూటకో మాట:పవన్ కళ్యాణ్ పై పేర్నినాని ఫైర్
మాట మీద నిలబడని వ్యక్తి పవన్ కళ్యాణేనని మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు. మంత్రుల కార్లపై దాడులకు దిగిన జనసేన కార్యర్తలను అరెస్ట్ చేయవద్దా అని ఆయన ప్రశ్నించారు.
అమరావతి:మంత్రుల కార్లపై దాడికి దిగిన జనసేన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయవద్దా అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.మాట మీద నిలబడని వ్యక్తి పవన్ కళ్యాణేనని నాని చెప్పారు. తాను చెప్పిన ఏ మాటకు ఆయన కట్టుబడి ఉన్నాడో చెప్పాలని పేర్ని నాని ప్రశ్నించారు.సోమవారంనాడు రాత్రి తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి పేర్నినాని మీడియాతో మాట్లాడారు.జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విమర్శలకు ఆయన కౌంటరిచ్చారు.పవన్ కళ్యాణ్ డైలాగ్ లకు చిన్నపిల్లలు కూడా భయపడరన్నారు. పవన్ కళ్యాణ్ మాటకు నీటి మీద రాతకు తేడా లేదని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు.
విశాఖపట్టణంలో మంత్రుల కార్లపై జనసేన అల్లరి మూకలు దాడి చేశాయని పేర్నినాని చెప్పారు. మహిళా మంత్రులు రోజా, విడుదల రజనిని జనసేన కార్యకర్తలు బూతులు తిట్టారన్నారు. జనసేన దాడిలోొ రోజా వ్యక్తిగత కార్యదర్శికి తీవ్రగాయాలైన విషయాన్ని మాజీ మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.దళిత మంత్రి నాగార్జునపై చెప్పులు విసిరారని చెప్పారు.విశాఖలో పవన్ కళ్యాణ్ ర్యాలీ కారణంగా రోడ్ల మీద జనం ఇబ్బంది పడుతున్నారని ఐపీఎస్ అధికారి చెబితే తప్పా అని నాని ప్రశ్నించారు.
అమరావతిని రాజధానిగా అనేక వర్గాలు వ్యతిరేకించాయని పేర్నినాని చెప్పారు.రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలనే ఉద్దేశ్యంతో తమ ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని చెప్పామన్నారు.. విశాఖలో పరిపాలనా రాజధాని కోసం జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ గర్జనను నిర్వహించినట్టుగా నాని చెప్పారు.విశాఖ గర్జనకు వైసీపీ మద్దతును ప్రకటించిందన్నారు. ఈ విషయం తెలియకుండా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు.
తనతో పాటు అంబటి రాంబాబు,వెల్లంపల్లి శ్రీనివాస్ ,అవంతి శ్రీనివాస్ ల గురించి చేసిన విమర్శలు వ్యక్తిగతమైనవా? విధానపరమైనవా? చెప్పాలని ఆయన కోరారు.కాకినాడలో ఎన్నికల ప్రచారంలో భాగంగా చలమలశెట్టి సునీల్ గురించి ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలని పేర్నినాని పవన్ కళ్యాణ్ ను కోరారు.
అడ్దదిడ్డంగా వాగుతూ విధానపరమైన విమర్శలు మాత్రమే చేస్తున్నా అంటూ పవన్ కళ్యాణ్ చెప్పే మాటలు సమర్థనీయమా అని ఆయన ప్రశ్నించారు.పూటకో మాట రోజుకో మాట మాట్లాడే నేత పవన్ కళ్యాణే అని పేర్నినాని విమర్శించారు. పోలీసులను తమ విధులు కూడా నిర్వహించవద్దని జనసేన నేతలు చెబుతున్నారన్నారు. విధుల నిర్వహణలో పోలీసులకు ఒత్తిడి ఉంటుందన్నారు. మంత్రుల మీద దాడి చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేయకూడదా అని ఆయన ప్రశ్నించారు.
also read: ప్రాంతాలు, ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే వైసీపీ ప్లాన్:పవన్ కళ్యాణ్ ఫైర్
విశాఖలో పార్టీ కార్యకర్తలకు రూ.60 లక్షల చెక్కులు ఇచ్చేందుకు రూ.25 లక్షలు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ వెళ్లారన్నారు. సినిమా డైలాగ్ లు కొట్టి ఇంటికి వెళ్లి పవన్ కళ్యాణ్ పడుకొంటారన్నారు. కానీ జగన్ మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారన్నారు.