Asianet News TeluguAsianet News Telugu

మెజార్టీ ఉందని ఇష్టమొచ్చినట్లు చేశారు: మండలి పరిణామాలపై బుగ్గన వ్యాఖ్యలు

సంఖ్యాబలం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు వ్యవహరించారని.. అంతేకాకుండా ఛైర్మన్‌ను ప్రభావితం చేశారని ఆయన మండిపడ్డారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుపై చర్చించిన తర్వాత అసెంబ్లీ ఆమోదించి అనంతరం వాటిని మండలికి పంపిందన్నారు ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

finance minister buggana rajendranath reddy slams tdp over ap legislative council incident
Author
Amaravathi, First Published Jan 23, 2020, 3:40 PM IST

సంఖ్యాబలం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు వ్యవహరించారని.. అంతేకాకుండా ఛైర్మన్‌ను ప్రభావితం చేశారని ఆయన మండిపడ్డారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుపై చర్చించిన తర్వాత అసెంబ్లీ ఆమోదించి అనంతరం వాటిని మండలికి పంపిందన్నారు ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.

బుధవారం సాయంత్రం మండలిలో జరిగిన పరిణామాలపై అసెంబ్లీలో మాట్లాడిన ఆయన... మండలికి చేరిన బిల్లును చర్చించిన తర్వాత ఆమోదించడమో లేదంటే తిరస్కరించడమో చేయాలన్నారు. కానీ రూల్ నెం.71 అనే అంశాన్ని అడ్డం పెట్టుకుని బిల్లును చర్చకు రానీయకుండా చేశారని మంత్రి ఆరోపించారు.

Also Read:మండలి రచ్చ: పోడియం పైకెక్కిన కొడాలి నాని (ఫోటోలు)

బీఏసీ సమావేశంలో రెండు బిల్లులను ప్రవేశపెడుతున్నట్లు తెలిపామని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వ బిజినెస్ గురించే సభలో మెజార్టీ అంశాలను పరిగణనలోనికి తీసుకోవాలన్నారు. రూల్ నెం.71 అంటే ప్రభుత్వ పాలసీపై చర్చించి దానిపై అభిప్రాయాలు మాత్రమే తెలియజేసేందుకే ఈ నిబంధనను తీసుకొచ్చారని బుగ్గన పేర్కొన్నారు.

రెండు బిల్లులను పరిగణనలోనికి తీసుకుంటున్నట్లు ఛైర్మన్ ప్రకటించారని కానీ... సెలక్ట్ కమిటీకి పంపాల్సిందిగా టీడీపీ సభ్యులు కోరారని మంత్రి చెప్పారు. మండలిలో నిబంధనలకు విరుద్ధంగా చర్చించామని ఛైర్మన్ అన్నారని బుగ్గన ప్రస్తావించారు.

శాసనసభ బిల్లును మండలికి పంపిస్తే చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపే విచక్షణాధికారం ఛైర్మన్‌కు లేదని రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. సవరణలు, తీర్మానాల విషయంలోనే ఛైర్మన్‌కు విచక్షణాధికారం ఉంటుందని బుగ్గన చెప్పారు.

ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభకు.. దిగువ సభకు ఎంతో వ్యత్యాసం ఉందని, కేవలం సలహాలు ఇచ్చేందుకే పెద్దల సభ ఉందని రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం మండలిలో ప్రభుత్వ ప్రతిపాదనను పక్కనబెట్టి మండలి ఛైర్మన్ రూల్ 71ని ఉపయోగించారని మంత్రి గుర్తుచేశారు.

Also Read:అందుకే శాసన మండలి రద్దు ఆలోచన: బొత్స సంచలనం

సెలక్ట్ కమిటీకి బిల్లులను పంపాలని లేఖలు ఇచ్చినట్లుగా ప్రతిపక్షం చెబుతోందని కానీ, సెలక్ట్ కమిటీకి పంపించాలంటే సభలో తీర్మానం చేయాలని బుగ్గన వెల్లడించారు. తనకున్న విచక్షణాధికారాన్ని మండలి ఛైర్మన్‌ దుర్వినియోగపర్చారని రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

మంత్రులు తాగి వచ్చారని యనమల ఆరోపణలు చేశారని, చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగా ఛైర్మన్‌పై ఒత్తిడి తెచ్చారని బుగ్గన మండిపడ్డారు. చట్టసభలు ప్రజాస్వామ్యానికి పునాదని..  మండలి స్ఫూర్తిని టీడీపీ దెబ్బతీస్తోందని, తాను తప్పు చేస్తున్నా కానీ.. సెలక్ట్ కమిటీకి రిఫర్ చేస్తున్నానని ఛైర్మన్ ప్రకటించారని మంత్రి గుర్తుచేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios