తల్లి తండ్రి లేని బాలికను చేరదీసాడు. తండ్రిలాగా ఆదరిస్తాడని అనుకుంది. కానీ తన పబ్బం గడుపుకోవడానికి తనను పావుగా వాడుకుంటాడని ఊహించలేకపోయింది. తనకు ఊహ తెలిసిన నాటి నుంచే వ్యభిచార కూపంలో పడేశాడు. ఆ కూపం నుంచి బయటపడి హాయిగా పెళ్లి చేసుకొని తన బతుకు తాను బతుకుతున్నా కూడా... ఆ పెంపుడు తండ్రి ఆమెను వదలలేదు. పెళ్లి తర్వాత కూడా వ్యభిచారం చేయాలని వేధించడం మొదలుపెట్టాడు. తట్టుకోలేక పోయిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో అతనిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... చిలకలూరి పేటకు చెందిన యువతి పెంపుడు తండ్రి ప్రభుదాస్ అలియాస్ వీరారావు వద్ద ఆశ్రయం పొందుతోంది. సదరు తండ్రి ఆమెను చిన్న వయసులోనే వ్యభిచార కూపంలో దింపాడు. 13 సంవత్సరాల నుంచి వ్యభిచారం చేయిస్తున్నాడు. దాంతో వచ్చిన డబ్బులతో జల్సా చేసేవాడు. కొంతకాలం క్రితం  ఆమెకు వివాహం అయ్యింది.

ఆమెకు పెళ్లి జరిగిన తర్వాత కూడా వ్యభిచారం చేయిస్తుండటంతో విషయం భర్తకు తెలిసి వదిలి వెళ్లిపోయాడు. దీంతో సదరు మహిళ వ్యభిచారం చేయనని చెప్పి వీరారావుకు తెలియకుండా ఇద్దరు పిల్లలతో చిలకలూరిపేటకు వచ్చి జీవిస్తోంది. ఇది తెలుసుకున్న వీరారావు చిలకలూరిపేటకు వచ్చి మరలా వ్యభిచారం చేయాలని సదరు మహిళతో గొడవకు దిగాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.