ఒంగోలు: ప్రకాశం జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తమతో లైంగిక క్రీడకు నిరాకరించాడనే ఆగ్రహంతో 27 ఏళ్ల యువకుడిని ఫేస్ బుక్ మిత్రుడు, అతని స్నేహితులు చంపేశారు. 

ప్రధాన నిందితుడు సాయి కిరణ్ బాధితుడు బ్రహ్మారెడ్డి ఫేస్ బుక్ ద్వారా మిత్రులయ్యారు. బ్రహ్మారెడ్డి ప్రకాశం జిల్లాలోని దర్శి మండలం లంకోజుపల్లి గ్రామానికి చెందిన వాడు. 

ఉపాధ్యాయ నియామక పరీక్షల కోసం సిద్ధమవుతున్న బ్రహ్మారెడ్డిఫేస్ బుక్ ద్వారా కొద్ది నెలల క్రితం పరిచయమైన సాయి కిరణ్ ను  కలిశాడు. సాయి కిరణ్ దర్శిలో ఉంటున్నాడు.  ఓ రోజు సాయికిరణ్ బ్రహ్మారెడ్డిని తన జన్మదిన వేడుకలకు ఆహ్వానించాడు. 

ఆహ్వానం అందుకున్న బ్రహ్మారెడ్డి సాయి కిరణ్ వద్దకు వెళ్లాడు. సాయి కిరణ్ తో పాటు అక్కడ అతని నలుగురు మిత్రులు ఉన్నారు. ఆ తర్వాత జన్మదిన వేడుకల కోసం ఓ ఫామ్ హౌస్ కు వెళ్లి అక్కడ ఫూట్ గా తాగేశారు. 

ఆ తర్వాత సాయికిరణ్, అతని మిత్రులు బ్రహ్మారెడ్డి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించారు. తమతో లైంగిక క్రీడ జరపాలని పట్టుబట్టారు. అతన్ని బెదిరించారు. 

తామంతా స్వలింగ సంపర్కులమని చెప్పారు. బ్రహ్మారెడ్డి అందుకు నిరాకరించడంతో అతన్ని చంపేసి, శవాన్ని పారేశారు. స్థానికులు శవాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బ్రహ్మా రెడ్డి ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేసి నలుగురు నిందితులను, వారికి సహకరించిన నిందితుల్లోని ఒకతని తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. 

పోలీసులు సాయికిరణ్, శ్రవణ్, నరసింహా రావులను, ఓ మైనర్ బాలుడి, శ్రవణ్ తండ్రిని అరెస్టు చేశారు. శ్రవణ్ సంఘటన గురించి చెప్పడంతో వారు పారిపోయేందుకు అతని తండ్రి నిందితులకు సహకరించాడు.