టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం అమరావతి ఉద్యమంపై మాట్లాడిన దివాకర్‌రెడ్డి.. 70 ఏళ్లు పైబడిన వారంతా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

ఈ వయసులో తమ స్పీచ్‌లతో అమరావతి ప్రజలను వారు రెచ్చగొడుతున్నారని జేసీ ఆరోపించారు. ఏడాది గడిచినా వీటితో ఏమైనా స్పందన ఉందా అని నిలదీశారు. అలాంటప్పుడు ఇంకెందుకు ఉద్యమం అన్న ఆయన  ప్రభుత్వం స్పందించదన్నారు. ప్రాణత్యాగానికి వారు సిద్ధం కావాలని జేసీ పిలుపునిచ్చారు.

అమరావతి కోసం తాను ఆమరణ దీక్ష చేస్తానని, వృద్ధ నాయకులు మాటలు కట్టిబెట్టి ఉద్యమానికి రావాలని జేసీ దివాకర్‌రెడ్డి ఆహ్వానించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 4న తాడిపత్రితో తన సోదరుడు ప్రభాకర్‌రెడ్డితో కలిసి తాను ఆమరణ దీక్ష చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

144 సెక్షన్‌, 30 యాక్ట్‌, కోవిడ్ యాక్ట్‌ అమల్లో ఉన్నా దీక్ష ఉంటుందని జేసీ వెల్లడించారు. అరెస్టులు చేసినా పర్లేదని దివాకర్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. తనతో పాటు 70 ఏళ్ల వారు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఎస్సీ, ఎస్టీ కేసులను రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని, అందుకే తాను వీటికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నట్లు జేసీ దివాకర్ రెడ్డి వెల్లడించారు. స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు వేయొద్దని కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. అసలు అమరావతి గొడవ ప్రధానికి తెలుసో, లేదోనని జేసీ అభిప్రాయపడ్డారు.