ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి మీడియా సంస్థలపై తెలుగుదేశం పార్టీ ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసింది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఐటీ దాడులకు సంబంధించిన వార్తలను వక్రీకరించారంటూ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సదరు ఏజెన్సీలకు లేఖ రాశారు.

ఏ మాత్రం సంబంధం లేని విషయాలను తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అపాదించారని ఆయన అందులో పేర్కొన్నారు. నైతిక విలువలు, జర్నలిజం ప్రమాణాలను దిగజారుస్తున్నారంటూ యనమల మండిపడ్డారు. నిరాధారమైన వార్తల క్లిప్పింగ్‌లు, వీడియో సీడీలను ఎడిటర్స్ గిల్డ్‌, ప్రెస్ కౌన్సిల్‌కు యనమల పంపారు. 

Also Read:వైసీపీపై చట్టపరమైన చర్యలు: బాబు మాజీ పీఎస్ ఇంట్లో సోదాలపై యనమల

కొద్దిరోజుల క్రితం రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ.. ఐటీశాఖ తన పంచనామా నివేదికలో  రూ.2.63లక్షలు స్వాధీనం చేసుకున్నట్లుగా చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ సరైన లెక్కలుచూపడంతో వాటిని కూడా తిరిగిచ్చేసిందని, దాన్ని వదిలేసి రూ. 2వేలకోట్లు దొరికాయని అడ్డగోలుగా, అవాస్తవాలతో దుష్ప్రచారం చేశారని యనమల మండిపడ్డారు. 

మూడు ఇన్ ఫ్రా కంపెనీల గురించి ఐటీశాఖ తన నివేదికలో చెప్పిందని... ఆ కంపెనీలన్నీ జగన్ కు అత్యంత సన్నిహితమైనవి కావడం వల్లే వాటిని గురించి మంత్రులుగానీ, సాక్షి మీడియా గానీ ఎక్కడా ప్రస్తావించలేదన్నారు.

చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో ఎక్కడా రూ.2వేలకోట్లు దొరికినట్లు ఐటీ చెప్పలేదన్నారు. బోగస్ కంపెనీలు కొన్ని రూ.2వేలకోట్ల వరకు పన్నులావాదేవీలకు సంబంధించిన బకాయిలు ఎగ్గొట్టాయని చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. 

Also Read:చంద్రబాబు కుటుంబంపై దుష్ప్రచారం...సాక్షిని వదిలేదే లేదు...: యనమల

ప్రజాస్వామ్యంలో అతికీలకమైన ఫోర్త్ ఎస్టేట్ పతనమైతే ప్రజాస్వామ్యం కూడా పతనమవుతుందని... అటువంటి ఫోర్త్ ఎస్టేట్ లో ఉంటూ తప్పుడు ప్రచారం చేసినందుకు సాక్షి మీడియాను బ్లాక్ లిస్ట్ లో పెట్టి తీరుతామని యనమల తేల్చిచెప్పారు. ఫోర్త్ ఎస్టేట్ తప్పుడు మార్గంలో  వెళుతున్నప్పుడు దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత రాజ్యాంగంపై ఉంటుందన్నారు. 

కేవలం ఫిర్యాదులతోనే సరిపెట్టకుండా సాక్షిమీడియాపై పరువు నష్టం దావా కూడా వేస్తామని... ఐపీసీ చట్టాల ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.