విజయనగరం: ప్రముఖ కళాకారుడు వంగపండు ప్రసాద రావు కన్నుమూశారు. విజయనగరం జిల్లాలో పార్వతీపురం తన స్వగ్రామంలోని ఇంట్లో గుండెపోటుతో కన్నుమూశారు. గత పది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం తెల్లవారు జామున ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. వంగపండు ప్రసాదరావు 1943లో పెద్దబొండపల్లిలో జన్మించారు. 

నక్సలైట్ ఉద్యమంతో కలిసి పనిచేసిన ఆయన వందలాది పాటలు రాశారు. విప్లవోద్యమానికి బాసటగా గద్దర్ తో కలిసి ఆయన జన నాట్య మండలి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. దాదాపు 300కు పైగా పాటలు రాశారు. ఆయన పాటలు హిందీ, బెంగాలీ వంటి పది భాషల్లోకి అనువాదమయ్యాయి. ఇంగ్లీషులోకి కూడా అనువాదమయ్యాయి. ఇటీవలే ఆయనకు సుద్దాల హనుమంతు అవార్డు అందుకున్నారు. 

ఉత్తరాంధ్ర బాణీలతో పాటలు రాసి ప్రదర్శనలు ఇస్తూ ఉత్తరాంధ్ర ప్రజలను చైతన్యపరచడంలో ముఖ్య భూమికను పోషించారు. షిప్ యార్డులో ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయన పూర్తి స్థాయిగా విప్లవోద్యమానికి అంకితమయ్యారు. అర్థరాత్రి స్వతంత్రం సినిమా ద్వారా ఆయన సినీ రంగప్రవేశం చేశారు.

ఆయన కూతురు ఉష ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సాంస్కృతి మండలి చైర్ పర్సన్ గా ఉన్నారు. ఉత్తరాంధ్ర గద్దర్ గా ఆయనకు పేరుంది. నక్సలైట్ ఉద్యమంతో ఆయన జీవితం పెనవేసుకుపోయింది. ఆ తర్వాత ఆయన ఉద్యమానికి దూరమయ్యారు. "ఏం పిల్లడో వెళ్దామొస్తావా, సీకాకుళం అడవుల్లో సిలకలు కత్తులు దులపరిస్తయట" అనే పాట ప్రజలను చైతన్య పరిచారు. 2017లో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవార్డును అందుకున్నారు.

వంగపండు ప్రసాద రావు మృతికి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉత్తరాంధ్ర జానపద శిఖరం, ప్రజాకవి, కళాకారుడు వంగపండు ప్రసాదరావు మృతి తీరని లోటు అని ఆయన ట్విట్టర్ వేదికగా అన్నారు ఈ తెల్లవారు జామున వంగపండు వెళ్లిపోయారనే వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. వందలాది జానపద గేయాలతో ప్రజల్లో వంగపండు స్పూర్తిని రగిలించారని ఆయన అన్నారు. వంగపండు కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతి వ్యక్తం చేశారు