గుంటూరు: తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన వృద్ధుడు సుబ్బయ్య చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురుజాల మండలం దైద వద్ద శవం లభ్యమైంది. అయితే, పోలీసులు ఆ విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. ఏ బిడ్డకు కూడా ఇలాంటి కష్టం రాకూడదని బాధితురాలి తల్లి అంటోంది.

వృద్ధుడు తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన సంఘటన గుంటూరు జిల్లా దాచేపల్లిలో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. దాచేపల్లి ప్రజలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు స్టేషన్ ముందు మహిళలు ధర్నాకు దిగారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా వారికి నాయకత్వం వహించారు.

సిఎం డౌన్ డౌన్ అంటూ రోజా నినాదాలు చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడు సుబ్బయ్యను పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అతని ఆచూకీ కోసం 17 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. అత్యాచారం చేసిన తర్వాత అతను కృష్ణా నదివైపు వెళ్లాడనే సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టారు.

తాను చనిపోతానని సుబ్బయ్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పోలీసులు కృష్ణా నది పరిసరాల్లో డ్రోన్ కెమెరాలతో గాలింపు జరుపుతున్నారు. తెంగెడ, పొందుగుల గ్రామ పరిసరాల్లో కూడా పోలీసులు గాలింపు చర్యలు జరుగుతున్నాయి. మరో వాదన కూడా వినిపిస్తోంది. అతను తెలంగాణ రాష్ట్రానికి పారిపోయి ఉంటాడనేది ఆ వాదన.  

కృష్ణా నదిలో గుర్తు తెలియని శవం కనిపించింది. అది సుబ్బయ్యదేనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పోలీసులు మాత్రం ఆ విషయాన్ని ధ్రువీకరించడం లేదు. 

అతని వేధింపులు భరించలేక మొదటి భార్య ఇరవై ఏళ్ల క్రితమే వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. రెండో భార్య ఏడాది కూడా కాపురం చేయలేదని, తన దారి తాను చూసుకుందని అంటున్నారు. 

అయితే, సుబ్బయ్య గ్రామంలో అందరితో కలుపుగోలుగా వ్యవహరించేవాడు. పిల్లలను రిక్షాలో తిప్పుతూ వారికి బిస్కట్లు, చాక్లెట్లు కొని పెట్టేవాడు. ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆ అవసరాలు తీరుస్తూ అన్ని పనులూ చేసి పెట్టేవాడు. కానీ 9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేయడంతో అతని అసలు రంగు బయటపడిందని అంటున్నారు.