గుంటూరు: దాచేపల్లి అత్యాచార ఘటనకు సంబంధించిన కేసులో నిందితుడు సుబ్బయ్య చివరి కాల్ తన బంధువుకు చేశాడు. తాను చేయకూడని పని చేశానని, చావడానికే వెళ్తున్నానని అతను తన బంధువుకు ఫోన్ చేసి చెప్పాడు. 

తాను చేసిన పని వల్ల తన కుమారుడు పరువు పోయిందని అతను అన్నట్లు తెలుస్తోంది. సుబ్బయ్య గుంటూరు జిల్లాలోని గురజాల మండలం దైద వద్ద అమరలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలో చెట్టుకు ఉరేసుకుని మరణించాడు. 

సుబ్బయ్య ఎప్పుడు ఉరేసుకున్నాడనేది వైద్యుల పరీక్షల్లో తేలుతుందని డిజిపి మాలకొండయ్య అన్నారు. అత్యాచారం చేసిన తర్వాత సుబ్బయ్య కృష్ణా నది వైపు వెళ్లినట్లు సమాచారం అందడంతో పోలీసులు నదిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావించారు. 

దాచేపల్లిలో 9 ఏళ్ల బాలికపై 55 ఏళ్ల వృద్ధుడు సుబ్బయ్య అత్యాచారం చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాచేపల్లి గ్రామం ఆందోళనతో అట్టుడికిపోయింది.