ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా మండిపడ్డారు. శుక్రవారం విజయవాడలో పర్యటించిన ఆయనను అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు కలిసి ప్రభుత్వ తీరును, ప్రజల ఇబ్బందులను వివరించారు.

Also Read:మూడు రాజధానులు: యడియూరప్పకు గ్రీన్ సిగ్నల్, జగన్ కు ఊరట

ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ.. మూడు రాజధానుల పేరుతో జగన్ సృష్టించిన రాజకీయ అనిశ్చితి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలకు విలువ ఇవ్వనీ రీతిలో ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరమని రాజా ఆవేదన వ్యక్తం చేశారు.

మూడు రాజధానులపై ముఖ్యమంత్రికి ఎవరు సలహాలు ఇస్తున్నారో కానీ.. ప్రపంచంలో ఎక్కడా లేని విధానాలు ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకని ఆయన నిలదీశారు. ప్రజలతో పోరాటం చేయడం కంటే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాలని రాజా హితవు పలికారు.

Also Read:ఐదేళ్లలో ఎంత నొక్కేసారో బయటపెడతాం... విజయసాయి రెడ్డి కౌంటర్లు

ప్రజాస్వామ్యంలో ప్రజలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలను ప్రభుత్వం గౌరవించాలన్నారు. కానీ దురదృష్టవశాత్తూ ఏపీలో ఆ పరిస్ధితి లేదని రాజా ఆరోపించారు. రాజధాని తరలింపును నిరసిస్తూ ఆందోళన చేస్తున్న నిరసనకారులు, మహిళలపై దాడులును సీపీఐ తరపున ఖండిస్తున్నామని చెప్పారు. మూడు రాజధానుల విధానానికి తమ పార్టీ వ్యతిరేకమని, రాజధానిగా అమరావతే ఉండాలన్నదే తమ అభిప్రాయమని రాజా తేల్చి చెప్పారు.