కాల్‌మనీ గ్యాంగ్ ప్పచని కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజలో వడ్డీవ్యాపారుల వేధింపులు తట్టుకోలేక భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.

గ్రామంలోని పుల్లయ్య నగర్‌కు చెందిన పూర్ణచంద్రరావు, లక్ష్మీ దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. కుటుంబ అవసరాల కోసం ఫైనాన్స్ వ్యాపారుల వద్ద వడ్డీ రూపంలో అప్పు చేశారు.

Also Read:కాల్‌మనీ: తాడేపల్లి పీఎస్ ముందు వెంకట్ ఆత్మహత్యాయత్నం

ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తున్నప్పటికీ ఇటీవల వడ్డీ వ్యాపారుల వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. దీంతో మరో దారి లేక ఇద్దరూ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

దీని ఆధారంగా ఈ ఘటనలో ప్రమేయం వున్న నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా అనేక నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సదరు సూసైడ్ నోట్‌లో మొత్తం ఆరుగురు తమ ఆత్మహత్యకు కారణమని దంపతులిద్దరూ పేర్కొన్నారు.

Also Read:వదిలే ప్రసక్తేలేదు, వారంతా జైలుకే: హోంమంత్రి సుచరిత సంచలన నిర్ణయం

వీరిలో గుంటూరుకు చెందిన డీఎస్పీ కుమారుడు సహా పక్కింట్లో ఉండే మున్నీ పేర్లు ప్రముఖంగా పేర్కొన్నారు. అప్పు తీర్చలేదు కాబట్టి.. కుటుంబంలో వున్న ఆడపిల్లలంతా వ్యభిచారం చేయాలని వారు వేధించినట్లుగా పూర్ణచంద్రరావు దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇదే సమయంలో డీఎస్పీ కొడుకు ప్రమేయం ఉండటంతో అతనిని కేసు నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతోందని మృతుడి కుమారుడు ఆరోపిస్తున్నారు. దీంతో సూసైడ్ నోట్‌లో ఉన్న పోలీసు అధికారి పాత్రపై దర్యాప్తునకు బాధిత కుటుంబం డిమాండ్ చేసింది. అయితే సూసైడ్ నోట్‌లో ఉన్న ఆరుగురిపై తాము కేసులు పెట్టామని పోలీసులు చెబుతున్నారు.