ఆమధ్య తెలంగాణాలో సంచలనం సృష్టించిన చెడ్డీ గ్యాంగ్ దృష్టి ఏపి పై పడింది. రాష్ట్రంలో అక్కడక్కడ దొంగతనాలను ఈ గ్యాంగ్ మొదలుపెట్టింది. ఆ మధ్య అనంతపురంలో హల్ చల్ చేసిన గ్యాంగ్ తాజాగా ఏలూరులో ఓ ఇంటిని యటాక్ చేసింది.

ఏలూరులో చెడ్డీ గ్యాంగ్‌ అర్ధరాత్రి 1.05 గంటలకు ఒక ఇంట్లో దోపిడీకి విఫలయత్నం చేసింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ ఇంటిలో అద్దెకు ఉంటున్న యజమాని అర్ధరాత్రి వేళ పోలీసులకు సమాచారం ఇచ్చినా సకాలంలో స్పందించకపోవటం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. భగవంతుడే తమని కాపాడాడని, లేకుంటే తమ కుటుంబం ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదంటూ యజమాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

ఐదుగురు సభ్యుల ఈ గ్యాంగ్ ఇంటిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. బయట శబ్దం విన్న వెంటనే ఇంటి యజమాని విషయం గ్రహించి 100 నంబర్‌కు ఫోన్‌ చేశారు. అయితే, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఉపయోగం కనబడలేదు. దాంతో ఇంట్లో వారిలో టెన్షన్ పెరిగిపోయింది. దాంతో వెంటనే యజమాని తనకు తెలిసిన వాళ్ళకు ఫోన్లు చేయటంతో కొందరు వెంటనే స్పందించి ఇంటి వద్దకు చేరుకున్నారు.

బయట శబ్దాలు గ్రహించిన గ్యాంగ్ అలర్టయి అక్కడి నుండి పారిపోయింది.  ఈ విషయం నగరంలో దావానలంలా వ్యాప్తించటంతో నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఈ దోపిడీ ముఠా విషయం విని భయపడిపోతున్నారు. పోలీస్‌ అధికారులు మాత్రం ఇది షోలాపూర్‌ గ్యాంగ్‌ పనే అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దోపిడీ ముఠా ఎవరై ఉంటారనే అంశాలపై ఆరా తీశారు. రాత్రి సంఘటన జరిగిన పరిస్థితులను బాధితుని అడిగి తెలుసుకున్నారు.