Asianet News TeluguAsianet News Telugu

పవన్! మోడీ నీ ముందే చెప్పాడు, వంత పాడుతావా?: బాబు

ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ప్రశ్నించారు.

Chandrababu questions Pawan Kalyan

కాకినాడ: ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ప్రశ్నించారు. కాకినాడలో శుక్రవారం జరిగిన ధర్మపోరాట సభలో మోడీ ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై తీవ్రంగా ధ్వజమెత్తారు.

ఎన్నికల ప్రచారంలో పవన్‌ కల్యాణ్ ముందే ఆనాడు నరేంద్ర మోడీ అన్ని హామీలు ఇచ్చారని, కానీ ఈ రోజు పవన్‌ ప్రధానిని ఒక్క మాట కూడా అనడం లేదని చంద్రబాబు అన్నారు. పవన్ కల్యాణ్ కేంద్రానికే వంతపాడుతూ తనను విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. 

రాష్ట్రానికి అన్యాయం చేస్తే వదిలిపెట్టబోమని కేంద్రాన్ని హెచ్చరించారు. దేవుడి పేరు చెప్పుకొని ఓట్లు అడిగే బిజెపి తిరుమల వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని అన్నారు. 

దేశంలో పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో బ్యాంకులు, ఏటీఎంలలో డబ్బులు లేవని చంద్రబాబు అంటూ దేశంలో ఇదేమి పరిపాలన అని ప్రశ్నించారు. ఈ నిర్ణయంతో 20లక్షల ఉద్యోగాలు పోయాయన్నారు. బ్యాంకులపై నమ్మకం పోవడానికి కారణం ఎవరని అడిగారు. 

స్విస్‌ బ్యాంకుల్లో 2017లో 50శాతం నిధులు పెరిగాయని వార్తలు వచ్చాయని అంటూ స్విస్‌ బ్యాంకుల్లో డబ్బులు ఎవరివని అడిగారు నల్లధనం వెనక్కి తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు వేస్తానని మోడీ అన్నారని చంద్రబాబు గుర్తు చేస్తూ నల్లధనంలో 15 పైసలైనా వచ్చాయా అని అడిగారు.

Follow Us:
Download App:
  • android
  • ios