చిత్తూరు: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మంగళవారం సాయంత్రం ఇస్తున్న విందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఆహ్వానం రాకపోవడంపై ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక నేరగాడు కాబట్టే జగన్ ను ట్రంప్ పర్యటనకు ఆహ్వానించలేదని ఆయన అన్నారు. చిత్తూరు జిల్లా టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు మంగళవారం సమావేశమయ్యారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. ట్రంప్ విందులో పాల్గొనడానికి కేసీఆర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు కూడా. దేశంలోని ఎనిమిది ముఖ్యమంత్రులకు మాత్రమే ఆహ్వానాలు పంపించారు. వారిలో వైఎస్ జగన్ లేరు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆ వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందని, టీడీపీ హయాంలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయని, వైసీపీ ప్రభుత్వ హయాంలో అవన్నీ వెనక్కి వెళ్లిపోతున్నాయని ఆయన అన్నారు. జగన్ మూర్ఖుడిలాగా, సైకోలాగా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తనపై కక్షతో కుప్పానికి నీళ్లు రానివ్వకుండా చేస్తున్నారని ఆయన అన్నారు. 

సాగు, తాగు నీటి ప్రాజెక్టులన్నింటినీ ఆపేశారని ఆయన విమర్శించారు. మీడియాపైనా కేసులు పెట్టిస్తున్న ఒకే ఒక వ్యక్తి జగన్ అని చంద్రబాబు అన్నారు. సోషల్ మీడియా ద్వారా టీడీపీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. త్వరలో నారా లోకేష్ కుప్పంలో పర్యటిస్తారని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటాన్ని కుప్పం నుంచే ప్రారంభిస్తామని చెప్పారు. తప్పుడు కేసులు పెడితే సంఘటితంగా పోరాడుదామని చెప్పారు.