అమరావతి: తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండవల్లి ప్రజావేదికపై చేస్తున్న వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రజావేదికను కోరడం సమంజసమా అని ఆయన అడిగారు. ప్రజావేదిక అక్రమకట్టడం అయినప్పుడు చంద్రబాబు నివాసం కూడా అక్రమ కట్టడమేనని ఆయన అన్నారు. 

గతంలో టీడీపీ ప్రభుత్వం విపక్ష నేతకు ఎలాంటి గౌరవం ఇచ్చిందో తాము చూశామని, తాము కూడా ఆ విధంగానే వ్యవహరిస్తామని బొత్స అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు ఓ భవనం కూడా నిర్మించలేదని బొత్స ఆరోపించారు. మంత్రుల చేంబర్స్ కూడా సరిగా లేవని ఆయన అన్నారు.
 
ప్రజావేదికను ప్రభుత్వానికి అప్పగించాలని నోటీసులు ఇచ్చినా ఖాళీ చేయలేదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రజావేదిక ప్రభుత్వానిదని, టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. జగన్ డబ్బులు ఆదా చేయాలనే చూస్తున్నారని, చంద్రబాబులా దుబారా చేయడం లేదని ఆయన అన్నారు.

ప్రజా వేదికను తమకు ఇవ్వాలని చంద్రబాబు రాసిన లేఖకు ప్రభుత్వం సమాధానం కూడా ఇవ్వలేదని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. ప్రజా వేదిక గురించి ప్రభుత్వం చేస్తున్న విమర్శలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని ఆయన అన్నారు.