Asianet News TeluguAsianet News Telugu

సీఎం గారూ...మీ ఇలాకాలోనే రైతుల ఆత్మహత్యలా?: జగన్ కు కళా వెంకట్రావు ఘాటులేఖ

ఆంధ్ర  ప్రదేశ్ లో రైతుల సమస్యలను వివరిస్తూ ఏపి ముఖ్యమంత్రి  జగన్ కు రాష్ట్ర టిడిపి అధ్యక్షులు  కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు.

AP TDP Chief Kala Venkatrao  writes open letter to CM YS Jagan
Author
Amaravathi, First Published Apr 20, 2020, 8:50 PM IST

గుంటూరు: కరోనా విజృంభణ, లాక్ డౌన్ పొడిగింపు కారణంగా చేతికొచ్చిన పంటలను కూడా అమ్ముకోలేకపోతున్నారని ఏపి టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు ఆరోపించారు. ప్రస్తుతం రైతుల సమస్యల గురించి  వివరిస్తూ ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డికి ఓ బహిరంగ లేఖ రాశారు. ఇందులో ఓవైపు రైతుల సమస్యలపై ఆవేదన వ్యక్తం చేస్తూనే  మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు కళా  వెంకట్రావు.  

బహిరంగ లేఖ యదావిధిగా

గౌరవనీయులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు.

విషయం: పంటలను అమ్ముకోలేక రైతులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించడం, గిట్టుబాటు ధరలు కల్పించడం, రవాణ, మార్కెటింగ్ సదుపాయం, దళారులకు అడ్డుకట్ట, హార్టికల్చర్ రైతులను ఆదుకోవడం, ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు పరిహారం అందజేయడం గురించి.         

రాష్ట్రంలో లాక్ డౌన్ నేపథ్యంలో అన్నదాతలు తాము పండించిన పంటలను అమ్ముకోలేక అనేక అవస్థలు పడుతున్నారు. రైతులను ఆదుకుంటామని, పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ప్రభుత్వం చెబుతున్న మాటలు ప్రకటనలకే పరిమితం అయ్యాయి. నెల రోజులు గడుస్తున్నా రైతులను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులు మీ దృష్టికి రావడం లేదా? వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ ఇప్పటికీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకుంటున్నారు. మరోవైపు పండించిన పంటలను ఇంటికి తరలించేందుకు కూలీల కొరత వేధిస్తున్న విషయం వాస్తవం కాదా? దళారులు విజృంభించి రైతుల వద్ద పంటలను తక్కువ ధరలకు కొనుగోలు చేస్తుంటే ఏం చేస్తున్నారు? రైతులు తీవ్రంగా నష్టపోతుండటం పట్ల ఏం చర్యలు తీసుకున్నారు? 

రాష్ట్రంలో రబీ సీజన్ లో 22.44 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. పంటకోత, రవాణ, ఎగుమతులు, మార్కెటింగ్ సౌకర్యాలు లేక ధరలు సగానికి పైగా పడిపోయాయి. ప్రధానంగా వరి, మొక్కజొన్న, శనగ, మిర్చి, కంది ఉన్నాయి. రాయలసీమతో పాటు ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో అరటి, మామిడి, బొప్పాయి, బత్తాయి, నిమ్మ, దానిమ్మ, కొబ్బరి, కర్బూజ, పుచ్చకాయలను ఎక్కువగా సాగు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు మాటలకే పరిమితం అయ్యాయి. ఇప్పటికీ ఖరీఫ్ కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లే పూర్తికాలేదు. ఇప్పుడు రబీ సీజన్ లో పంట కోతకు వచ్చింది. దీనిపై ప్రభుత్వం వద్ద సరైన కార్యాచరణ లేదు. మినుము, పెసర, కంది, శనగ, వేరుశనగ పంటలకు రవాణ సదుపాయాలు లేక రైతులు, దళారుల వద్దే పంట నిలిచిపోయింది. మిర్చి ఇప్పటికీ కల్లాల్లోనూ, శీతల గిడ్డంగుల్లోనూ ఉన్నాయి. వీటిని కొనే నాథుడే లేడు.

మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకు పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడం లేదు. అయినకాడికి దళారులకే పంటలను విక్రయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తామన్న జగన్ హామి మాటలకే పరిమితం అయింది. ప్రభుత్వమే మార్కెఫెడ్ ద్వారా అన్ని వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులకు చెల్లింపులు చేయాలి. అటు రాయలసీమ, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో ఉద్యానపంటలు సాగుచేస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోతుండటం మీకు కనిపించడం లేదా? తోటల్లోనే అరటి ఎండిపోయే పరిస్థితి నెలకొంది. మామిడి ఎగుమతుల్లేక ధర పడిపోయింది. రవాణ, ఎగుమతుల్లేక రైతులు తోటల్లోనే తమ పంటలను వదిలేస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఒంగోలులో గెల అరటి రూ.50కే రైతులు అమ్ముకున్నారు. మామిడి ఎగుమతులు లేకపోవడంతో పక్వానికి వచ్చిన పంట చెట్టుపైనే ఉండిపోయింది. మామిడి రైతులకు రవాణ సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. స్థానికంగా అమ్ముకునేందుకూ లాక్ డౌన్ నిబంధనలతో కొనేవారు కరువయ్యారు. 

అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో గిట్టుబాటు ధర లేక రైతులు టమోట పంటను రోడ్డుపైనే వదిలేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే అరటికి సరైన ధర లభించక పశువులకు మేతగా వదిలివేయడం రాష్ట్రంలో నెలకొన్న దయనీయ పరిస్థితికి అద్ధం పడుతోంది. ఆక్వా రైతులు నష్టపోతున్న విషయం మీ దృష్టికి రాలేదా? ప్రభుత్వం ప్రకటించిన ధరలకు, క్షేత్రస్థాయిలో చెల్లిస్తున్న ధరలకు పొంతన లేదు. రైతుల ఘోష మీకు వినిపించడం లేదా? ఆరాగలం శ్రమించి తమ ఉత్పత్తులు అమ్ముడుపోక రైతులు గుండెలు బాదుకుంటుంటే మీరు మొద్దునిద్ర పోతున్నారా?   వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడంలో, రైతులకు భరోసా కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పంటలను కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం వాస్తవం కాదా? 

కడప జిల్లా పులివెందుల చిన్నరంగాపురానికి చెందిన పౌల్ రెడ్డి తన చినీ పంటను అమ్ముకోలేక పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గుండెమడగలలో చీమల రఘురామిరెడ్డి తన పత్తి పంటను అమ్ముకోలేక అప్పులభారం పెరిగి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడం అందరినీ కలచివేస్తోంది. రాజధాని తరలింపు, ఎస్ఈసీ తొలగింపు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉన్న శ్రద్ధ రైతులను ఆదుకోవడంలో లేదు. వైసీపీ నేతలు రాజకీయాలకే పరిమితం అవుతూ.. అన్నదాతలను వారి మానాన వారిని వదిలేశారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు తక్షణ సాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. 

ఏప్రిల్ 20 నుంచి వ్యవసాయ, ఉద్యానవన, పౌల్ట్రీ, ఆక్వా ఉత్పత్తులకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇప్పటికైనా రవాణ, మార్కెటింగ్ లో రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాలి. ఈ-క్రాప్ బుకింగ్ తో సంబంధం లేకుండా పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఇప్పటికే నష్టపోయిన రైతులకు ఆర్థిక చేయూత ఇవ్వాలి. 

  

                                                                                                                                                                                                                     కిమిడి కళా వెంకట్రావు,                                                                                                                                                                                                                              తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు.


 

Follow Us:
Download App:
  • android
  • ios