అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్‌ కు కీలక పదవి లభించింది. గుంటూరు జిల్లా పరిషత్‌లో ఎక్స్‌ అఫిషియో మెంబర్‌గా లోకేష్ నమోదయ్యారు. 

రెండేళ్లక్రితం శాసనమండలికి ఎన్నికై ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు లోకేష్‌. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకు ఎక్స్ అఫిషియో మెంబర్ గా నమోదయ్యే ఛాన్స్ లభించింది. 

ఎమ్మెల్సీలు ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్స్‌ అఫిషియోమెంబర్‌గా నమోదయ్యే అవకాశం ప్రభుత్వం కల్పించడంతో ఎమ్మెల్సీ ఏ నియోజకవర్గంలో నమోదు అవుతారో ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్సీకి ప్రొటోకాల్‌ వర్తింపచేస్తుంది ప్రభుత్వం. 

దీంతో ఎమ్మెల్సీ నారా లోకేష్‌ కు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మంగళగిరి మున్సిపాలిటీల్లో ఎక్స్‌అఫిషియో మెంబర్‌గా అవకాశం దక్కింది.  ఈ నేపథ్యంలో లోకేష్‌ గుంటూరు జిల్లా పరిషత్‌లో ఎక్స్‌ అఫిషియో మెంబర్‌గా కొనసాగనున్నారు. 

లోకేష్ ఎక్స్ అఫిషియో మెంబర్ గా ఎన్నికైన నేపథ్యంలో ఈనెల 23న జరిగే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరుకావాల్సిందిగా జిల్లా పరిషత్ అధికారులు ఎమ్మెల్సీ లోకేష్ కు ఆహ్వానం పంపించారు.