అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సుమారు మూడు గంటలపాటు ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నవరత్నాలు, కీలక ప్రాజెక్టులకు నిధుల సమీకరణపై వైయస్ జగన్ ఆర్థిక శాఖ అధికారులతో చర్చించారు. రాష్ట్ర బడ్జెట్‌లో నవరత్నాలకు నిధుల సమీకరణ, కేటాయింపుపై ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ సూచించారు. 

కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలను రాబట్టేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో ఆదాయ వనరుల పెంపుపై ప్రధానంగా దృష్టి సారించాలని సీఎం జగన్ ఆదేశించారు. 

రాష్ట్రప్రజలపై ఎలాంటి భారం పడకుండా ఆదాయ వనరులు పెంచే మార్గాలను అన్వేషించాలని ఆర్థిక శాఖ సమీక్షలు జగన్ సూచించారు. అనవసరపు ఖర్చులు తగ్గించేలా బడ్జెట్ ఉండాలని ఆర్థిక అధికారులకు సూచించారు.
 
ఇకపోతే జూలై 10 నుంచి అసెంబ్లీ బడ్జెట్ నిర్వహించే అంశంపై చర్చించారు. గత ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని జగన్ ఆదేశించారు.

బడ్జెట్ సమావేశాలను 17 రోజుల పాటు నిర్వహించాలని ఆర్థికశాఖ సమీక్షలు సీఎం జగన్ నిర్ణయించారు. అలాగే  2019-20 బడ్జెట్‌లో ఉండాల్సిన ప్రతిపాదనలపై సీఎం జగన్ ప్రధానంగా చర్చించారు.