అమరావతి: ప్రముఖ కళాకారుడు వంగపండు ప్రసాద రావు మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. వంగపండు ఇక లేరన్న వార్త ఎంతో బాధించిందని ఆయన అన్నారు. వంగపండు వ్యక్తిగతంగా తనకు ఆప్తులు అని జనగ్ అన్నారు. 

జానపదాన్ని తన బాణీగా మార్చుకుని ‘‘పామును పొడిచిన  చీమలు’’న్నాయంటూ ఉత్తరాంధ్ర ఉద్యమానికి అక్షర సేనాధిపతిగా మారారని కొనియాడారు. తెలుగువారి సాహిత్య, కళారంగాల చరిత్రలో ఓ మహాశిఖరంగా ఆయన నిలిచిపోతారని జగన్ అన్నారు. వంగపండు కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

వంగపండు ప్రసాదరావు మృతికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి సంతాపం ప్రకటించారు. వంగపండు ఉత్తరాంధ్ర జానపదాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్లిన కళాకారుడని ఆమె అన్నారు. వంగపండు తమ విజయనగరం జిల్లావాసి కావడం తమకు గర్వకారణమని ఆయన అననారు. 

తమ పాటలు, రచనలు, ప్రదర్శనలతో ప్రజల్లో చైతన్యం నిపించిన వ్యక్తి వంగపండు అని ఆమె అన్నారు. ఐదు దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజల కష్టాలను తన పాటల ద్వారా వినిపించిన గొప్ప కళాకారుడు వంగపండు అని ఆమె అన్నారు. వంగపండు మరణం యావత్ ఉత్తరాంధ్ర ప్రజలకు తీరని లోటు అని పుష్పశ్రీవాణి అన్నారు. వంగపండు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. 

ప్రముఖ జానపద వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు మృతి సమాజానికి ముక్యంగా ఉత్తరాంధ్ర కు తీరని నష్టమని 10 వ శాసనసభలో సభ్యుడు మానం ఆంజనేయులు,సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి. సత్యనారాయణ మూర్తి ప్రగాఢ సంతాపం తెలిపారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లా పార్వతీపురం లో మారుమూల గ్రామం లో జన్మించిన వంగపండు పెద్దగా చదువుకోకపోయిన ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై తన కలం గళం తో సామాన్యులకు సైతం సరళంగా అర్ధమయ్యే జానపద పాటలు స్వయంగా రాసి గజ్జగట్టి పాడుతూ సమాజాన్ని మేలుకొల్పేవారని వారన్నారు.

ఆయన రాసిన జానపద విప్లవ గేయాలు పలు విప్లవ చిత్రాల్లో ప్రాచుర్యం పొందాయని, ముఖ్యంగా స్వర్గీయ మాదాల రంగారావు నిర్మించిన విప్లవశంఖం లో జజ్జనకరి జనారె జనకుజనా జనారె పాట మంచి ప్రజాదరణ పొందిందని ఇలాంటి ఎన్నో అద్భుతమైన జానపద గీతాల సృష్టించిన వంగపండు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని వారు చెప్పారు. 

వంగపండు మృతికి తీవ్ర సంతాపం ప్రకటించి వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. వంగపండు మృతి పట్ల సీపీఐ జిల్లా, నగర,కార్యదర్సులు బాలేపల్లి వెంకటరమణ,మరుపిళ్ల పైడిరాజులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు

ప్రముఖ కళాకారుడు వంగపండు ప్రసాద రావు కన్నుమూసిన విషయం తెలిసిందే. విజయనగరం జిల్లాలో పార్వతీపురం తన స్వగ్రామంలోని ఇంట్లో గుండెపోటుతో కన్నుమూశారు. గత పది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. వంగపండు ప్రసాదరావు 1943లో పెద్దకొండపల్లిలో జన్మించారు.