కాకినాడ: టీడీపీ ఎంపీల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఎంపీలు ప్రైవేట్‌గా మాట్లాడుకొన్న విషయాలను మీడియాలో ప్రసారం చేసే  అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నించారని ఆయన చెప్పారు. కొన్ని మీడియా సంస్థలు రాష్ట్ర ప్రయోజనాల కంటే ఉద్దేశ్యపూర్వకంగా వ్యవహరిస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.

కాకినాడలో  ధర్మపోరాట సభ దీక్ష సభను  శుక్రవారం నాడు టీడీపీ నిర్వహించింది.ఈ సభలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. 2014 ఎన్నికల సమయంలో తిరుపతి వేదికగా  మోడీ ఇచ్చిన హమీలను  ఆయన ప్రస్తావించారు.ఆనాడు మోడీ చేసిన ప్రసంగం వీడియోను ప్రజలకు చూపించారు.

కడపలో ఉక్కు ఫ్యాకర్టీని ఏర్పాటు చేయాలని ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి నిరహార దీక్ష చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. కేంద్ర మంత్రి  బీరేంద్రసింగ్‌ను కలిసిన సమయంలో  టీడీపీ ఎంపీలకు మంత్రి  మాటలు చెప్పి తప్పించుకొన్నారని ఆయన చెప్పారు. టీడీపీ ఎంపీల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా  కొందరు ప్రయత్నించారని  బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఎంపీ, ఎమ్మెల్సీ ఆమరణ నిరహార దీక్షలను విపక్ష నాయకుడు  ఎద్దేవా చేశారని ఆయన  గుర్తు చేశారు.

రాష్ట్రానికి న్యాయం జరుగుతోందనే ఉద్దేశ్యంతోనే ఎన్నికల సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నాలుగేళ్ళ పాటు  కేంద్రం ఏపీకి ఇచ్చిన హమీలను అమలు చేయలేదని చెప్పారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేరస్తులకు మద్దతు పలికే  పరిస్థితికి వచ్చారని బాబు విమర్శలు గుప్పించారు.  2019 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి రైతాంగానికి నీళ్లిచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇప్పటికే 56 శాతం ప్రాజెక్టు పనులను పూర్తి చేసినట్టు ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను నీతి ఆయోగ్  రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించిందని ఆయన చెప్పారు.


అమరావతి రాజధాని నిర్మాణం కోసం కేంద్రం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చిందని ఆయన చెప్పారు. రైల్వేజోన్ ఇవ్వకుండా అడ్డుకొంటున్నారని ఆయన చెప్పారు. రైల్వే జోన్ ఏర్పాటు విషయమై  ఒడిశా అడ్డుపడుతోందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా రూపాయి దివాళ తీసిందన్నారు. ఏటీఎంల్లో నగదు లభ్యం కాకుండాపోయిందన్నారు. విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని  తెప్పిస్తామని మోడీ ఇచ్చిన హమీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.

  రైతాంగానికి రెట్టింపు ఆదాయం వచ్చేలా చేస్తామని ఇచ్చిన హమీని కేంద్రం అమలు చేయలేదని ఆయన విమర్శలు గుప్పించారు. ప్రజల కోసం కేంద్రం ఎలాంటి  పనులు చేయలేదని ఆయన చెప్పారు. ఈ పరిస్థితుల్లో కూడ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

కొందరు నేతలకు తాము నివసించే ఇల్లు రాజభవనం మాదిరిగా ఉండాలని కోరుకొంటారు, కానీ, రాజధాని నిర్మాణానికి ఇన్ని వేల ఎకరాల భూమి అవసరమా అని ప్రశ్నిస్తారని బాబు విపక్ష నేతపై విమర్శలు గుప్పించారు. మరో వైపు నాలుగేళ్లపాటు కన్పించని అవినీతి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఇవాళ కన్పిస్తోందని  చంద్రబాబునాయుడు చెప్పారు.

పవన్ కళ్యాణ్ కూడ కేంద్రానికి వంత పాడుతున్నారని ఆయన విమర్శించారు. విభజన హమీ చట్టాన్ని కేంద్రం అమలు చేయడం లేదన్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను కేంద్రం పరిష్కరించడం లేదని బాబు ఆరోపించారు. 

రెండు రాష్ట్రాలు గొడవ పెట్టుకొంటే కేంద్రం సంతోషంగా ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు విషయమై తాను కేంద్రాన్ని అడగలేదన్నారు.

వైసీపీకి స్వంత మైకు  బీజేపీకి అద్దె మైకుగా మారిన బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తనపై విమర్శలు చేసే నైతిక హక్కు ఉందా అని ఆయన ప్రశ్నించారు. కాపులకు రిజర్వేషన్ల విషయంలో బీజేపీ నేతలు ఎందుకు పట్టించుకోవడం లేదో చెప్పాలన్నారు. కాపులకు రిజర్వేషన్ల విషయంలో బీసీలకు అన్యాయం చేయకుండా  చూస్తామని మరోసారి హమీ ఇచ్చారు. బీసీలు టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు.