కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ కోసం ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి ఉక్కు సంకల్పంతో దీక్ష చేస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. జిల్లా ప్రజల సంక్షేమం, అభివృద్ది గురించి కమిట్ మెంట్ తో వారు ఈ పని చేస్తున్నారని అన్నారు. వారు ఈ దీక్షతో స్పూర్తిధాయకమైన పోరాటం చేస్తున్నారని అభినందించారు. ఆరోగ్యం క్షీణిస్తున్నా సీఎం రమేష్ 11 రోజులు, బీటెక్ రవి 7 రోజులు దీక్ష చేయడం మామూలు విషయం కాదని అన్నారు. ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన ఆమరణ నిరాహార దీక్ష లాగే  ఉక్కు దీక్ష కూడా ముందుకు వెళుతోందని అన్నారు.  

కడప జిల్లాలో ఉక్కు ప్యాక్టరీ సాధన కోసం దీక్ష చేస్తున్న సీఎం రమేష్ ను ఇవాళ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పరామర్శించారు. ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం  ప్రసంగించారు. నాలుగైదు రోజులు కూడా దీక్ష చేయలేక పారిపోయిన నేతలు సీఎం రమేష్‌ను, ఆయన చేస్తున్న దీక్షను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఈ దీక్ష వల్ల సీఎం రమేష్ ఆరు కేజీలు, బిటెక్ రవి ఏడు కేజీలు తగ్గారని చంద్రబాబు తెలిపారు. చిత్తశుద్దితో చేస్తున్న దీక్షలపై అనవసరమైన విమర్శలు మానుకోవాలని సీఎం అన్నారు. 

విశాఖ పట్నంలో కూడా ఉక్కు ప్యాక్టరీ కోసం ఆనాడు ఆంధ్రులు ఇలాగే పోరాడారని అన్నారు. వీరి పోరాటానికి ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ దిగివచ్చి ప్యాక్టరీ ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. ఆనాడు విశాక ఉక్కు కర్మాగారానికి  రాష్ట్ర ప్రభుత్వం 19వేల ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిందని చంద్రబాబు గుర్తుచేశారు.

కడపకు ఉక్కు ప్యాక్టరీ వస్తే జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయని సీఎం తెలిపారు. ఇందుకోసం కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధన అఖిల పక్ష కమిటీని ఏర్పాటు చేసి పోరాడటం చాలా స్పూర్తిధాయకమని అన్నారు. ఈ కమిటీ ఏర్పాటు చేసిన వారికి, దీని ద్వారా పోరాడుతున్న వారికి సీఎం ధన్యవాదాలు తెలిపారు.

ఇక ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టంలోని 70 వ పేజీలో ఉక్కు ప్యాక్టరీ ఏర్పాటుకు సాధ్యాసాద్యాలను పరిశీలిస్తామని కేంద్రం చెప్పిందని చంద్రబాబు అన్నారు. దీనిపై మెకాన్ అనే సంస్థ ఇక్కడ స్టీల్ ప్యాక్టరీ పెట్టవచ్చని నివేధిక ఇచ్చిందని, దీని ప్రకారం వెంటనే ప్యాక్టరీ ఏర్పాటు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.  

ఈ ప్యాక్టరీ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించడానికి సిద్దంగా ఉన్నట్లు చంద్రబాబు వివరించారు. దీనికి కావాల్సిన మౌళిక సదుపాయాలన్నీ ముందే సమకూర్చి పెట్టామని అన్నారు. జిల్లాలో లభించే 266 మిలియన్ మెట్రిక్ టన్నుల ఐరన్ ఓర్ ను కేవలం ఈ ఉక్కు ప్యాక్టరీకే ఇవ్వడానికి సిద్దమని అన్నారు. అలాగే 3500 ఎకరాల భూమిని ఈ ప్యాక్టరీ కోసం సిద్దం చేశామని, దీన్ని ఏ ధరకైనా కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడానికి సిద్దమేనని చంద్రబాబు అన్నారు.

రాష్ట్ర ప్రజలు అందరూ సంఘటితంగా ఉంటేనే కేంద్రం దిగి వస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇలాంటి సమయంలోనే మన సత్తా ఏంటో కేంద్రానికి చూపించి మన హక్కులను సాధించుకోవాలని ప్రజలకు చంద్రబాబు సూచించారు.