ఆంధ్రప్రదేశ్‌లో ఘోర ప్రమాదం ... రియాక్టర్ పేలి 18మంది మృతి, 50 మందికిపైగా గాయాలు

 అచ్యుతాపురం సెజ్ లోని ఫార్మా కంపనీలో చోటుచేసుకున్న ప్రమాదంలో మృతుల సంఖ్య 18కి చేరింది. ఇక క్షతగాత్రుల సంఖ్య  కూడా అంతకంతకు పెరుగుతోంది. 

 

 

Andhra Pradesh pharma firm explosion: 15 dead, over 50 injured in Atchutapuram SEZ AKP

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్ లోని ఎస్సెన్షియా ఫార్మా కంపెనీలోని రియాక్టర్ పేలి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరో 50 మందికి పైగా గాయపడ్డారు. మధ్యాహ్నం రియాక్టర్ పేలిన సమయంలో కంపనీలో దాదాపు 381 మంది పనిచేస్తున్నట్లు సమాచారం.   అయితే భోజన సమయంలో ఈ  పేలుడు సంభవించడంతో ప్రమాద తీవ్రత ఈ స్థాయిలో వున్నా ప్రాణాపాయం తప్పింది. 

సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. పేలుడు తీవ్రతకు పరిసర ప్రాంతాల్లోని భవనాల కిటికీలు, అద్దాలు పగిలిపోయాయి. మూడో అంతస్తులో రియాక్టర్ పేలడంలో గోడలు కూలి కార్మికులపై పడ్డాయి. ఇలా శిథిలాల కింద చిక్కుకుని కూడా కొందరు కార్మికులు మృతిచెందారు. 

 

 ఫ్యాక్టరీలో 381 మందికి పైగా కార్మికులు

ఈ ఫ్యాక్టరీలో రెండు షిఫ్టుల్లో 381 మంది కార్మికులు పనిచేస్తున్నారని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ తెలిపారు. భోజన విరామ సమయంలో ఈ దుర్ఘటన జరగడంతో ఫ్యాక్టరీలో తక్కువ మంది కార్మికులు ఉన్నారని చెప్పారు.

ఎస్సెన్షియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ కంపెనీ ఇంటర్మీడియట్ కెమికల్స్ మరియు యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియెంట్స్ (APIs) తయారుచేస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (APIIC) యొక్క మల్టీ-ప్రొడక్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (SEZ)లో అచ్యుతాపురం క్లస్టర్‌లో 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.  

పేలుడుతో దట్టంగా పొగ

 అనకాపల్లి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పేలుడు తీవ్రతకు పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.  

మృతుల వివరాలు : 

ఈ కెమికల్ కంపనీలో పనిచేసే కార్మికులతో పాటు ఉద్యోగులు మృతిచెందారు.  ప్లాంట్ హెడ్ సన్యాసినాయుడు,  ల్యాబ్ హెడ్ రామిరెడ్డి, కెమిస్ట్ హారిక, ప్రొడక్షన్ ఆఫరేటర్ పార్థసారథి, ప్లాంట్ హెల్పర్ చిన్నారావు మృతుల్లో వున్నారు. అలాగే రాజశేఖర్, గణేష్, ప్రశాంత్, నారాయణరావు, మోహన్  కూడా మృతిచెందారు. మిగతా మృతుల వివరాలు తెలియాల్సి వుంది. 

ప్రమాదతీవ్రత ఎక్కువగా వుందికాబట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది కంపనీకి చేరుకున్నారు... ఇలా 12 అగ్నిమాపక వాహనాలు  కష్టపడి మంటలను అదుపుచేసారు. అనంతరం క్షతగాత్రులను బయటకు తీసి అనకాపల్లిలోని పలు హాస్పిటల్స్ కు తరలించారు. 

సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి :

ఫార్మా కంపనీ అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి ఈ ఘటన గురించి తెలుసుకున్నారు... మృతుల వివరాలను కూడా సీఎంకు తెలిపారు కలెక్టర్. సహాయక చర్యలు వేగవంతం చేయాలని... క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం సూచించారు. రేపు(గురువారం) చంద్రబాబు నాయుడు అచ్యుతాపురంలో ప్రమాదం జరిగిన కంపనీని పరిశీలించనున్నారు. అలాగే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో పాటు మృతుల కుటుంబాలను  పరామర్శించనున్నారు. 

ఈ ఘటనపై ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు సమీక్ష చేశారు. సహాయక చర్యలపై జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడారు. హెల్త్ సెక్రటరీతో మాట్లాడి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం సూచించారు. అవసరమైతే క్షతగాత్రులను విశాఖ లేదా హైదరాబాద్ తరలించేందుకు ఎయిర్ అంబులెన్సులను వినియోగించాలని ఆదేశించారు. కార్మికుల ప్రాణాలు కాపాడడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. 

ఇక ఈ ప్రమాదంపై ఉన్నత స్ధాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విచారణ ఆధారంగా...ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ప్రాణాలతో చెలగాటం ఆడే ఎవ్వరినీ వదిలిపెట్టబోమయని చంద్రబాబు అన్నారు. Q

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios