Asianet News TeluguAsianet News Telugu

గృహ నిర్మాణాలను ఆపాలన్న హైకోర్టు.. హౌస్ మోషన్ పిటిషన్ వేసిన ఏపీ ప్రభుత్వం

సెంటు, సెంటున్నర స్థలాల్లో గృహ సముదాయాలు ఏర్పాటు చేస్తామనడంలో హేతుబద్ధతనూ ప్రశ్నించింది. దీనిపై... లోతైన అధ్యయనం అవసరమని తెలిపింది. అప్పటిదాకా ఈ పథకాన్ని అమలు చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

Andhra pradesh Govt House Motion pitition on High court Judgement
Author
Hyderabad, First Published Oct 9, 2021, 11:57 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

 గృహ నిర్మాణంపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ వేసింది. కొద్దిసేపట్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ పథకం జాతీయస్థాయిలో ఉన్న పథకం కంటే ఉత్తమమైనదిగా ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ వాదనను సింగిల్ జడ్జి పూర్తిగా పరిగణలోకి తీసుకోలేదని ప్రభుత్వం పేర్కొంది.

కాగా..  ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం‘పేదలందరికీ ఇళ్ల పథకం’తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ పథకం పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సంచలన ఆదేశాలు జారీ చేసింది. కేవలం మహిళల పేరిట మాత్రమే పట్టాలు ఇవ్వాలన్న విధానాన్ని తప్పుపట్టింది. సెంటు, సెంటున్నర స్థలాల్లో గృహ సముదాయాలు ఏర్పాటు చేస్తామనడంలో హేతుబద్ధతనూ ప్రశ్నించింది. దీనిపై... లోతైన అధ్యయనం అవసరమని తెలిపింది. అప్పటిదాకా ఈ పథకాన్ని అమలు చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తి శుక్రవారం ఈ కీలక తీర్పు వెలువరించారు. 

‘నవ రత్నాలు - పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సర్కారు నిర్ణయించుకుంది. దీనిపై  2019 డిసెంబరు 2న జారీ చేసిన 367, 488 మార్గదర్శకాల జీవోలను సవాల్‌ చేస్తూ తెనాలికి చెందిన పొదిలి శివమురళి, మరో 128 మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పట్టాలను కేవలం మహిళా లబ్ధిదారులకే కేటాయించడంపై అభ్యంతరం తెలిపారు. పారదర్శకంగా ఇళ్ల  స్థలాలు కేటాయించేలా అధికారులను ఆదేశించాలని కోరారు.


పిటిషనర్ల తరఫున న్యాయవాది వీఎ్‌సఆర్‌ ఆంజనేయులు, ప్రభుత్వం తరఫున అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు. వాదోపవాదాలు విన్న అనంతరం జస్టిస్‌ సత్యనారాయణ మూర్తి శుక్రవారం సుదీర్ఘ తీర్పు వెలువరించారు. 

పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్ల స్థలంలో ఇంటిని కట్టుకోవాలంటున్నారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా లేదు. గృహ సముదాయాలు నిర్మించేటప్పుడు... ఆ ప్రాంతంలోని జనసాంద్రతకు అనుగుణంగా మౌలికవసతులు కల్పించకపోతే భవిష్యత్తులో అవి ‘మురికివాడలు’గా మారతాయి అని హైకోర్టు పేర్కొంది. 

స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టుకొమ్మని చెప్పే ముందు... ప్రభుత్వం పర్యావరణ ప్రభావం, అనారోగ్య సమస్యలు, అగ్ని ప్రమాదాల నివారణ, మంచినీటి లభ్యత, మురుగు రవాణాకు తగిన సౌకర్యాలు ఉన్నాయా? లేదా? అనేది పరిశీలించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. ప్రభుత్వం ఆ పని చేయలేదని తెలిపింది. 
 
మహిళలకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు కోర్టు వ్యతిరేకం కాదు. కానీ, మహిళలకు మాత్రమే ఇస్తామనడం వివక్ష చూపడమే. అర్హులైన పురుషులు, ట్రాన్స్‌జెండర్లకు కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలి అని హైకోర్టు తెలిపింది.  మహిళల పేరుతో మాత్రమే ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న ప్రభుత్వం నిర్ణయం అధికరణ 14,15(1) 39కి విరుద్ధమని తేల్చి చెప్పింది. మానవహక్కుల యూనివర్సల్‌ డిక్లరేషన్‌కు వ్యతిరేకమని పేర్కొంది. 

కేటాయించిన ఇంటి స్థలాన్ని ఐదు సంవత్సరాల తర్వాత విక్రయించుకొనే వెసులుబాటు కల్పించడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. అలా విక్రయించుకుంటే లబ్ధిదారులు మళ్లీ నిరాశ్రయులు అవుతారని పేర్కొంది. ఏపీ అసైన్డ్‌ భూముల బదిలీ నిషేధం చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా డీ-ఫామ్‌ పట్టాలు మాత్రమే ఇవ్వాలని తెలిపింది. కన్వేయన్స్‌ డీడ్‌లు చెల్లవని... వాటిని రద్దు చేయాలని తెలిపింది.

కాగా.. హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ వేయడం గమనార్హం. 

Follow Us:
Download App:
  • android
  • ios