అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు చోట్ల వరుసగా ప్యాక్టరీల్లో ప్రమాదాలు చోటు చేసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలోని ప్రతి ఫ్యాక్టరీలో తనిఖీలు నిర్వహించాలని భావిస్తోంది. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలో ఈ కమిటీ ప్రతి ఫ్యాక్టరీని తనిఖీ చేయనుంది.

విశాఖ పట్టణంలో ఇటీవల కాలంలో వరుసగా ప్రమాదాలో చోటు చేసుకొన్నాయి. ఎల్జీ పాలీమర్స్, సాయినార్, విశాఖలోన ఫార్మా సిటీలో ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. వారం రోజుల  క్రితం విశాఖ ఎయిర్ పోర్టుకు సమీపంలోని కంటైనర్ యార్డులో గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. మూడు  రోజుల క్రితం విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డులో భారీ క్రేన్ కుప్పకూలిన ఘటనలో 11 మంది మరణించారు.గత వారంలోనే నెల్లూరు జిల్లాలోని ఓ ఫ్యాక్టరీలో ప్రమాదం చోటు చేసుకొంది. 

also read:విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డు ప్రమాదం: అనుపమ్ క్రేన్ సంస్థపై కేసు

వరుస ప్రమాదాలతో రాష్ట్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు పూనుకొంది. పరిశ్రమల్లో తనిఖీలు  చేయాలని నిర్ణయం తీసుకొంది. ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలో నిపుణులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఆయా జిల్లాల్లోని ప్రతి ఫ్యాక్టరీని తనిఖీ చేయనుంది.

ప్రమాదకర కెమికల్స్, రెడ్ కేటగిరి పరిశ్రమల్లో ఈ కమిటి తనిఖీలు చేయనుంది. ప్రతి పరిశ్రమను తనిఖీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కమిటీ తనిఖీ చేసిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై 30 రోజుల్లోపే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

90 రోజుల్లో రాష్ట్రంలోని ప్రతి పరిశ్రమలో తనిఖీలు చేయడం పూర్తి కావాలని ప్రభుత్వం కోరింది. స్పెషల్ డ్రైవ్  ల పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కమిటీ చేసిన సిఫారసులను అమలు చేయని ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకొనే అవకాశం లేకపోలేదు.