Asianet News TeluguAsianet News Telugu

ఏపీలోని టాప్ 10 కాాలుష్య నగరాలు ... 2030 నాటికి అంతే సంగతి.. : CSTEP వార్నింగ్ 

 ఆంధ్ర ప్రదేశ్ లోని కీలక నగరాల్లో వాయుకాలుష్యం పెరిగిపోతోందని సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ ఆండ్ పాలసీ ప్రకటించింది. 10 నగరాల్లో పరిస్థితి ఎలా వుందంటే... 

Air pollution trends and projections in 10 cities of Andhra Pradesh AKP
Author
First Published Aug 27, 2024, 5:16 PM IST | Last Updated Aug 27, 2024, 8:55 PM IST

అమరావతి : కాలుష్యం ... ఈ టెక్ జమానాలో యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్న పదమిది. పెరుగుతున్న టెక్నాలజీతో పాటే ఈ కాలుష్యమూ పెరిగిపోతూ మానవ మనుగడనే ప్రశ్నార్ధకంగా మారుస్తోంది. మానవుల చర్యల కారణంగా ప్రకృతి వినాశనం జరిగి వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి... ముఖ్యంగా వాయు కాలుష్యం భారీగా పెరుగుతోంది.  అయితే ఈ వాయుకాలుష్యంపై భారతదేశంలోని 76 నగరాలపై స్టడీ చేపట్టింది సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ ఆండ్ పాలసీ (CSTEP). ఇందులో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన 10 నగరాలు కూడా వున్నాయి.

ఆంధ్ర ప్రదేశ్  లోని పలు నగరాల్లో వాయుకాలుష్యంపై గత రెండున్నరేళ్లుగా అధ్యయనం చేపట్టింది సిఎస్ టిఈపి. పరిశ్రమలు, వాహనాలతో పాటు వివిధ కారణాలవల్ల అనంతపురం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కర్నూల్, నెల్లూరు, ఒంగొలు, శ్రీకాకుళం, విజయనగరం పట్టణాల్లో గాలికాలుష్యం రోజురోజుకు పెరుగుతోందని ఈ అధ్యయనంలో తేలింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2030 నాటికి ఈ నగరాలలో PM2.5 (గాలిలో వుండే సూక్ష్మ కణాల వ్యాసం 2.5 మైక్రోమీటర్లు లేదా అంతకంటే తక్కువ)  ఎమిషన్లు 20-47 శాతం పెరగవచ్చని ఆందోళన వ్యక్తం చేసారు. అయితే  ఈ నగరాలను కాలుష్య కోరలనుండి బయటపడేసే మార్గాలను కూడా సూచించిన CSTEP ఇందుకోసం ప్రభుత్వం ఒక్కో నగరంలో 374-919 కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి వుంటుందని అంచనా వేసింది. 

కాలుష్య నివారణ చర్యలు ;

త్రీ వీలర్లు ముఖ్యంగా ఆటోరిక్షాల ఎలక్ట్రిఫికేషన్, బాగా పాతబడిన భారీ వాణిజ్య వాహనాలలో డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్ల వాడకం లాంటి చర్యలవల్ల కాలుష్య ఉద్గారాలను గరిష్టంగా తగ్గించవచ్చని సిఎస్ టిఈపి సూచించింది. ఇవి చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నవి... అలాగే వాతావరణంపై చాలా ఎక్కువ ప్రభావం చూపుతాయని తెలిపారు. అందువల్ల ఇలాంటి చర్యలపై దృష్టి సారించడం ద్వారా కాలుష్య కోరల్లో చిక్కుకున్న నగరాల్లో గాలి నాణ్యతను పెంచవచ్చని తెలిపారు. 

నిర్దిష్ట చర్యలను అమలుచేయడం ద్వారా ఆయా నగరాల్లో  PM2.5 ఎమిషన్స్ ను దాదాపు 30 శాతం తగ్గించవచ్చని వెల్లడించారు. ఉదాహరణకు గుంటూరులో పాత ఆటోరిక్షాల స్థానంలో ఎలక్ట్రిక్ లేదా సిఎన్జి ఆటోలను ఉపయోగించే ప్రోత్సహించాలి... ఇందుకోసం రూ.105 కోట్లు ఖర్చు చేస్తే 13 శాతం రవాణా ఉద్గారాలను తగ్గించవచ్చని అంచనా వేసారు. నెల్లూరులోనూ 15 సంవత్సరాల పైబడిన వాహనాలను తొలగించి ఎలక్ట్రిక్, సిఎన్జి వాహనాలను వాడేలా ప్రైవేట్ వాహన యజమానులకు ప్రోత్సహించాలని సూచించారు. 

కేవలం రవాణా ఉద్గారాల వల్లే కాదు థర్మల్ పవర్ ప్లాంట్ల వల్ల కూడా గాలికాలుష్యం ఎక్కువగా జరుగుతుందని సీఎస్  టిఈపి తెలిపింది. కాబట్టి ఇక్కడ కూడా కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన అవసరం వుందన్నారు. నగరాల పరిధిలో అత్యధిక కాలుష్యాన్ని కలిగించే పరిశ్రమలను గుర్తించడం... వాటిలో ఆధునిక పద్దతులను ఉపయోగించి కాలుష్యాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మొత్తంగా ఏపీ ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించేందుకు చాలా సీరియస్ గా పనిచేయాలి... ఇందుకోసం కొంత డబ్బు ఖర్చు చేయాలని సూచించారు. 

సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ ఆండ్ పాలసీ వాయు కాలుష్యంపై అధ్యయనం చేసిన నగరాల్లో ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తే కాలుష్యాన్ని తగ్గించవచ్చో వివరించారు.  

గుంటూరు : రూ.919 కోట్లు 

నెల్లూరు : రూ.690 కోట్లు  

విజయనగరం : రూ.469 కోట్లు 

శ్రీకాకుళం  : రూ.549 కోట్లు 

చిత్తూరు : రూ.374 కోట్లు 
  
కాబట్టి ప్రభుత్వం వెంటనే వాయు కాలుష్యాన్ని తగ్గించే చర్యలు తీసుకుని రాబోయే రోజుల్లో ప్రమాదకర పరిస్థితిని నియంత్రించాలని సిఎస్ టిఈపి హెచ్చరించింది.  తూతూమంత్రంగా కాకుండా ఇందుకోసం భారీగా నిధులు కేటాయించి ఖర్చు చేసినప్పుడే ఫలితం వుంటుందన్నారు. గాలి స్వచ్చత పెరిగితే ప్రజలు అనారోగ్య సమస్యలకు దూరంగా వుంటారు... ఆరోగ్యంగా జీవిస్తారు.    


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios