9 ఏళ్ల బాలికపై రేప్: నిందితుడి ఇల్లు ధ్వంసం, దాచేపల్లిలో ఉద్రిక్తత

9 Years old girl Raped: Tension prevails in Dachepalli
Highlights

దాచేపల్లిలో మైనర్‌ బాలికపై వృద్ధుడు అత్యాచారం చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేకిత్తించింది. 

గుంటూరు:  దాచేపల్లిలో మైనర్‌ బాలికపై వృద్ధుడు అత్యాచారం చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేకిత్తించింది. నిందితుడు సుబ్బయ్యను కఠినంగా శిక్షించాలంటూ పార్టీలు, వివిధ ప్రజాసంఘాలు ఆందోళనకు దిగడంతో దాచేపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. 

నిందితుడిపై పోక్సో చట్టం కింద శిక్ష విధించాలంటూ పట్టణంలో బంద్ నిర్వహించారు. ఇదే సమయంలో పలువురు ఆందోళనకారులు సుబ్బయ్య ఇంటిని ముట్టడించి ధ్వంసం చేశారు. మరోవైపు ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. 

హోంమంత్రి చినరాజప్ప జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాలికపై అత్యాచారం చేసిన పరారైన సుబ్బయ్య కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అతని ఆచూకీ తెలిస్తే.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి  చేశారు.

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఓ వృద్ధుడు చిన్నారి పాపపై అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బుధవారం రాత్రి నుంచే ఆందోళనలు కొనసాగుతున్నాయి. గురువారం దాచేపల్లి బంద్ జరుగుతోంది. 

సంఘటనను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా కెమెరామెన్ పై కూడా దాడి జరిగింది.  బాధితురాలి తల్లిదండ్రులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు బుధవారం అర్థరాత్రి ఆందోళనకు దిగారు. 

జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. మధ్యాహ్నంలోగా నిందితుడని అరెస్టు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. దాంతో బాధితులు వెనక్కి తగ్గారు. ఉద్రిక్తతలు తలెత్తకుండా గ్రామంలో పోలీసు బలగాలను మోహరించారు. అయితే, గురువారం తిరిగి ఆందోళనలు ప్రారంభమయ్యాయి.

జిల్లా ఎస్పీ కూడా దాచేపల్లికి చేరుకున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సుబ్బయ్య సెల్ ఫోన్ వాడుతున్నాడని తెలిసి ట్రాక్ చేసే ప్రయత్నం చేశారు. అయితే, దాన్ని గ్రహించి అతను సెల్ ఫోన్ ఆఫ్ చేసినట్లు తెలుస్తోంది. 

ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. టీడిపి నేతలు, మంత్రులు దాచేపల్లికి చేరుకుంటున్నారు. గురజాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని శాసనసభ్యుడు యరపతనేని శ్రీనివాస రావు పరామర్శించారు. బాలిక కుటుంబానికి ఆయన రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు.

loader