రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు దుండగులు 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. చింతూరు మండలం మామిళ్లగూడెంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

బాలికపై అత్యాచారం చేసి, ఆమెను చంపేసి, ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేసిన వారు తాజాగా ఐటిడిఎ అధికారులను ఆశ్రయించారు. 

ఇద్దరు బాలికలను అపహరించిన దుండగులు ఓ బాలికపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. మరో బాలిక వారి నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చినట్లు తెలుస్తోంది.  సంఘటనపై కేసు నమోదు చేశామని చింతూరు ఎస్సై లక్ష్ముడు చెప్పారు. 

తన కూతురుతో పాటు మరో బాలిక జులై 11వ తేదీన నర్సాపురంలో చదువుకుంటున్న తమ మిత్రులతో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో రమేష్, లక్ష్మణ్ అనే ఇద్దరు వారిని అడ్డగించారని మృతురాలి తల్లి ఫిర్యాదు చేసింది.