వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇంట్లో ఉన్న దుస్తులతో పాటుగా టవల్స్, బెడ్ షీట్లలో ఒక రకమైన దుర్వాసన వస్తుంటుంది. ఇలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
వర్షాకాలంలో ఇండ్లు, బట్టలు తేమగా ఉంటాయి. దీనివల్ల వాటికి ఫంగస్ రావడమే కాకుండా.. వాటిలో ఒక రకమైన దుర్వాసన కూడా వస్తుంటుంది. ఇలాంటి వాటిని అస్సలు వాడాలనిపించదు. ముఖ్యంగా ఈ సీజన్ లో దుస్తులను ఎన్ని సార్లు ఉతికేసినా ఇలాగే అవుతుంటుంది. అందుకే ఈతేమ సీజన్‌లో టవల్స్, బెడ్ షీట్లు దుర్వాసన లేకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
1. కర్పూరం :
హిందూ మాతంలో కర్పూరాన్ని పవిత్రంగా భావిస్తారు. వీటిని దేవుడి పూజలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ మీరు వీటిని ఒక్క పూజకే కాకుండా.. ఎన్నింటికో ఉపయోగించుకోవచ్చు. వర్షాకాలంలో వచ్చే ఫంగస్ ఇన్ఫెక్షన్, దుర్వాసనను తొలగించడానికి కూడా కర్పూరం బాగా సహాయపడుతుంది. దీని కోసం మీ ఇంట్లోని అన్ని కిటికీలు, తలుపులు మూసి కర్పూరాన్ని వెలిగించండి. ఈ పొగ సుమారు 15 నిమిషాలు ఇంట్లో ఉండేట్టు చూసుకోండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో దుర్వాసన రాకుండా, సువాసన వెదజల్లుతుంది.
2. బేకింగ్ సోడా :
టవల్స్, బెడ్ షీట్లను ఉతికేటప్పుడు నీటిలో 1 టీస్పూన్ బేకింగ్ సోడా కలిపి దానిలో అద్ది ఉతకండి. ఆ తర్వాత మళ్లీ సాధారణ నీటిలో టవల్స్, బెడ్ షీట్లను ఉతికి ఆరబెట్టండి. బేకింగ్ సోడా నీటితో ఉతికితే దుస్తులకున్న దుర్వాసన పూర్తిగా తొలగిపోతుంది. అలాగే టవల్స్, బెడ్ షీట్స్ తాజా వాసన వస్తాయి శుభ్రంగా కూడా ఉంటాయి.
3. ఇస్త్రీ చేయండి :
అవును వాష్ చేసిన టవల్స్ ను ఐరన్ చేసినా కూడా అవి వాసన రావు. తేమ వల్ల బెడ్ షీట్లు, టవల్స్ నుంచి దుర్వాసన రాకూడదంటే వాటిని ఉతికి ఆరేసిన తర్వాత ఇస్త్రీ చేయండి. దీనివల్ల వాటి నుండి దుర్వాసన రాదు. అలాగే సువాసనగా, తాజాగా ఉంటాయి.
4. వెంటిలేషన్ అవసరం :
వర్షాకాలంలో మీ ఇంటి కిటికీలు, తలుపులు ఎప్పుడూ మూసి ఉంటే కూడా ఇంట్లో దుర్వాసన రావడం ప్రారంభమవుతుంది. కాబట్టి కిటికీలు, తలుపులను అప్పుడప్పుడు తెరిచే ఉంచండి. దీని వల్ల శుభ్రమైన గాలి లోపలికి వచ్చి ఇంట్లో దుర్వాసనను బయటకు పోగొడుతుంది.
5. వెనిగర్ :
బేకింగ్ సోడా లాగే టవల్స్, బెడ్ షీట్లను ఉతకడానికి వెనిగర్‌ను ఉపయోగించొచ్చు. వెనిగర్ టవల్స్, బెడ్ షీట్లలో ఉండే దుర్వాసనను తొలగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అంతేకాకుండా దుస్తులు కూడా మృదువుగా అవుతాయి.
6. బాగా ఆరబెట్టండి :
వర్షాకాలంలో బెడ్ షీట్లు, టవల్స్ సరిగ్గా ఆరబెట్టకపోతే కూడా వాటి నుంచి ఒక రకమైన దుర్వాసన రావడం ప్రారంభమవుతుంది. కాబట్టి వాటిని ఎండలో బాగా ఆరబెట్టి, తర్వాత మడిచి పెట్టండి. అప్పుడే వాటి నుండి దుర్వాసన రాదు.
7. వాషింగ్ మెషిన్‌లో ఎక్కువగా వేయొద్దు :
మీరు వాషింగ్ మెషిన్‌లో బట్టలు ఎక్కువగా వేస్తే వాషింగ్ మెషిన్ వాటిని సరిగ్గా ఉతకదు. దుస్తుల్లో ఉండే మురికి అలాగే ఉండిపోతుంది. ఇలా మురికితో ఉన్న బట్టలను మీరు ఉపయోగిస్తే వాటి నుంచి దుర్వాసన ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి వాషింగ్ మెషిన్‌లో ఓవర్‌లోడ్ చేయకుండా ఉండండి.
8. తేమ ఉన్న ప్రదేశంలో ఉంచొద్దు :
వర్షాకాలంలో మీరు టవల్ ను ఎప్పుడూ బాత్రూమ్ లాంటి తేమ ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఉంచకండి. బదులుగా మీరు మంచి గాలి వచ్చే ప్రదేశంలో ఉంచండి. అప్పుడే, వాటి నుంచి దుర్వాసన రాదు.
9. డ్రైయర్ బాల్స్ :
మీరు వాషింగ్ మెషిన్‌లో టవల్స్, బెడ్ షీట్లను ఉతికేటప్పుడు డ్రైయర్ బాల్స్ ఉపయోగిస్తే తక్కువ సమయంలో బాగా ఉతికిపోతాయి. దీని వల్ల బట్టల్లో దుర్వాసన రావడం తగ్గుతుంది.
10. సిలికా ప్యాకెట్లు :
సిలికా ప్యాకెట్లు గాలిలో ఉండే తేమను పీల్చుకోవడానికి ఉపయోగిస్తారు. కాబట్టి టవల్స్, బెడ్ షీట్లు ఉంచిన ప్రదేశంలో వీటిని ఉంచితే, అవి పొడిగా, తేమ లేకుండా ఉంటాయి.