కేసీఆర్ సెల్ఫ్ గోల్, గులాబీ ఓనర్లు గప్ చుప్: అశ్వత్థామ రెడ్డి వెనక...

By telugu team  |  First Published Oct 18, 2019, 3:21 PM IST

ఆర్టీసి సమ్మెపై వైఖరి ద్వారా కేసీఆర్ సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారా అనే సందేహం కలుగుతోంది. అశ్వత్థామ రెడ్డి వెనక ఎవరున్నారనే చర్చ కూడా జరుగుతోంది. తెలంగాణలో బిజెపి తన ఆపరేషన్ ను ప్రారంభించిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.


హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ బాస్ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లే కనిపిస్తున్నారు. కమలనాథులకు తనంతతానుగా అస్త్రాలను అందించారని కూడా అనిపిస్తోంది. ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ వెనక్కి రాలేని చక్రబంధంలో చిక్కుకున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏకంగా 48 వేల మంది సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని ప్రకటించిన  కేసీఆర్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారని అంటున్నారు. 

ఆర్టీసీ సమ్మె విషయంలో కేవలం కార్మికుల సమస్యలు మాత్రమే ఇమిడిలేవని, తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పే వ్యూహాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తో పాటు మొత్తం 22 డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. విధులకు హాజరు కాని కార్మికులను డిస్మిస్ చేస్తామని కేసీఆర్ స్వయంగా హెచ్చరించినా పెద్దగా ఫలితం కనిపించలేదు. 

Latest Videos

ఆ తర్వాత 48 వేల మంది ఉద్యోగులు సెల్ఫ్ డిస్మిస్ ఆయ్యారని కేసీఆర్ ప్రకటించారు. బస్సులను పూర్తి స్థాయిలో నడిపించాలని ఆయన ఏ రోజుకారోజు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కు కేసీఆర్ ఆదేశాలను పాటించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఇప్పటి వరకు కేసీఆర్ ఏది అనుకుంటే అది చేయగలిగారు. తాను చేసే పనులకు ఓ వర్గం నుంచి మద్దతును కూడా పొందుతూ వచ్చారు. కానీ, ఇప్పుడు కేసీఆర్ ఏకాకి అయినట్లు కనిపిస్తున్నారు. 

మేధావి వర్గం ఏమైంది....

ఏదైనా వివాదం చెలరేగినప్పుడు, ఏవైనా విమర్శలు వచ్చినప్పుడు కేసీఆర్ కు అనుకూలంగా వివిధ వేదికల ద్వారా కొంత మంది మేధావులు, రచయితలు ప్రచారం సాగిస్తూ వచ్చేవారు. ప్రత్యర్థుల వాదనలకు ప్రతివాదాలను తయారు చేసి ప్రచారం సాగించేవారు. ఆ రకంగా ప్రజల్లోకి సానుకూల సంకేతాలు వెళ్లే విధంగా జాగ్రత్త పడేవారు. కాంగ్రెసు, టీడీపీతో కలిసి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటే సరిపోతుంది. కాంగ్రెసుతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం ద్వారా చంద్రబాబు ఆంధ్ర పెత్తనం తిరిగి వస్తుందని విరివిగా ప్రచారం చేశారు. 

ఇప్పుడు ఆర్టీసీ సమ్మె విషయంలో అటువంటి మేధావి వర్గమేదీ ముందుకు రావడం లేదు. అంత ఎక్కడికక్కడ మౌనంగా ఉండిపోయారు. దానికి ప్రధాన కారణం... ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ ను సమర్థించడానికి అవసరమైన లాజిక్ దొరక్కపోవడమే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండును పక్కన పెట్టి, కొన్ని సమస్యలను చర్చల ద్వారా తీర్చి ఉంటే పరిస్థితి చేయి దాటిపోయేది కాదు. కొన్ని సమస్యలను పరిష్కరించి, మిగతా సమస్యలపై ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి ఉంటే సరిపోయి ఉండేది. కానీ కేసీఆర్ అలా చేయలేదు. 

తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ మాట్లాడినదానికి ఆర్టీసీ సమ్మె పట్ల ఆయన వ్యవహరిస్తున్న తీరుకు ఏ మాత్రం పొంతన లేదు. పైగా, ప్రజలు, ఆర్టీసీ కార్మికులు వేర్వేరు అనే భావన కూడా సరైంది కాదు. ఆర్టీసీ కార్మికులు కూడా తెలంగాణ సమాజంలోని పౌరులే. అందువల్ల ప్రజలకు ఇబ్బందుల పాలు చేస్తున్నారనే విమర్శకు అసలు తావు లేదు. ఈ స్థితిలో మేధావి వర్గం పూర్తిగా మౌనం పాటిస్తోంది. 

ప్రైవేట్ పరం చేసే ఆలోచన...

సమ్మె విషయంలో కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి వెనక ఆంతర్యం వేరే ఉందనేది అందరికీ అర్థమైపోయింది. ఆర్టీసీని సగం ప్రైవేట్ పరం చేస్తున్నామని ఆయన చెబుతున్నారు. అది ఆర్టీసీ పూర్తిగా ప్రైవేట్ పరం చేయడానికి వేస్తున్న తొలి అడుగుగా భావిస్తున్నారు. ఇది తెలంగాణ సమాజం అంగీకరించే విషయం కాదు. 

ఆర్టీసీ ఆస్తుల విషయంలో కేసీఆర్ అనుసరించబోతున్న వైఖరిపై ఇప్పటికే వార్తాకథనాలు వచ్చాయి. అవి ఆందోళనకరంగానే ఉన్నాయి. కొంత మందికి ఆర్టీసీ ఆస్తులను కట్టబెట్టడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చేస్తున్న విమర్శలను కేవలం ప్రతిపక్షాలు చేసే విమర్శలుగా మాత్రమే కొట్టిపారేయడానికి వీలు లేని పరిస్థితి. 

ప్రైవేట్ పరం చేసే ఆలోచనతో మిగతా రంగాలకు చెందిన ఉద్యోగులు, కార్మికులు కూడా ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. పైగా, ప్రభుత్వ ఉద్యోగాలకు పీఆర్సీ, ఐర్ సమస్యలు చాలా కాలంగా ఉండనే ఉన్నాయి. ఆర్టీసీ కార్మికుల పరిస్థితి తమకు ఎదురు కాదనే గ్యారంటీ ఏమీ లేదు. దీంతో మిగతా రంగాలకు చెందిన ఉద్యోగులు, కార్మికులు కూడా ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటించే పరిస్థితి వచ్చేసింది. టీఎన్జీవోలు కాస్తా మెతగ్గా మాట్లాడుతున్నప్పటికీ వారు కూడా సమ్మెకు దిగే పరిస్థితి రావచ్చుననే అనిపిస్తోంది. 

బీటీ బ్యాచ్ వివాదం....

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మరోసారి యుటీ బ్యాచ్, బీటీ బ్యాచ్ అనే పదాలను విరివిగా ప్రచారంలోకి వచ్చాయి. బీటీ బ్యాచ్ (బంగారు తెలంగాణ) బ్యాచ్ ఆధిపత్యం ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతుందనే అభిప్రాయం బలంగా నాటుకుపోయి ఉంది. యూటీ బ్యాచ్ అంటే ఉద్యమ బ్యాచ్ వెనక వరుసలోకి వెళ్లిపోయింది. దీంతో ఉద్యమ ఆకాంక్షలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నెరవేరలేని పరిస్థితి వచ్చేసింది. 

ఉద్యమ కాలంలో చురుగ్గా వ్యవహరించిన వివిధ సంఘాల నాయకులు కొంత మంది ప్రభుత్వానికి బయటే ఉండిపోయారు. ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పేరుతో తన కోసం మాత్రమే పనిచేసినవారికి పదవులు ఇచ్చారు. అయితే, ఉద్యమ కాలంలో కేసీఆర్ అన్ని రంగాలవారికి ఓ ఆలంబన మాత్రమే. ఆయనను అల్లుకుని అన్ని వర్గాల ప్రజలు, అన్ని రంగాల ఉద్యోగులూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేశారు. 

అలాంటి స్థితిలోనే ఉద్యోగ సంఘాలకు నాయకత్వం వహించిన స్వామిగౌడ్, శ్రీనివాస గౌడ్, దేవీప్రసాద్ నాయకత్వాల కింద వారు విడివిడిగా ఉద్యమిస్తూనే ఉమ్మడి పోరాటంలో కలిసి వచ్చారు. అయితే, ఆ ముగ్గురు కూడా ప్రభుత్వంలో చేరిపోయారు. గతంలో మాదిరిగానే వారి మాటలను ఉద్యోగులు వింటారా అంటే సందేహమే. టీఎన్జీవో నేత రవీందర్ రెడ్డి ఆర్టీసీ సమ్మె విషయంలోనూ, తమ డిమాండ్ల విషయంలో చేస్తున్న ప్రకటనలు ఆ సందేహాలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ స్థితిలో ఆర్టీసీ సమ్మెను అల్లుకుని అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు ఆందోళనలకు దిగే అవకాశాలున్నాయని ప్రస్తుత పరిణామాలు తెలియజేస్తున్నాయి. న్యాయవాదులు శుక్రవారంనాడు కోర్టు నుంచి బస్ భవన్ వద్దకు తీసిన ర్యాలీ ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.

ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా తనతో కలిసి నడిచి నేతలను కేసీఆర్ పక్కన పెట్టారు. అలాంటివారికి కోదండరామ్ ను, విద్యుత్తు ఉద్యోగుల నాయకుడు రఘును ఉదాహరణగా చెప్పవచ్చు. చెప్పాలంటే, ఆర్టీసీ జేఎసి కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి కూడా అక్కడి నుంచి వచ్చివారే. అందువల్ల తెలంగాణ సమాజమంతా ఇప్పుడు కలిసి లేదనే అభిప్రాయానికి నిక్కచ్చిగా రావచ్చు.

ప్రభుత్వ, ప్రభుత్వ వ్యతిరేక వర్గాలుగా తెలంగాణ సమాజం చీలిపోయింది. ఉద్యమ కాలంలో మాదిరిగా ఆ సమాజం కలిసి లేదు. ఉద్యమ కాలంలో ప్రస్తుత ప్రతిపక్షాల వైఖరులను తెలంగాణకు అనుకూలంగా మలిచింది కూడా ఉమ్మడి తెలంగాణ సమాజం తప్ప కేసీఆర్ కాదు. కేసీఆర్ బయటకు కనిపించే నేత మాత్రమే. కేసీఆర్ కూడా తెలంగాణ సమాజం దారిలోనే నడవాల్సి వచ్చింది. తప్పటడుగులు వేశారా, లేదా అనే విషయాన్ని పక్కన పెడితే కేసీఆర్ ప్రజల ఉమ్మడి ఆకాంక్షకు అనుగుణంగా అప్పుడు నడుచుకున్నారు. ఇప్పుడు తెలంగాణలోని ఓ వర్గం ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారనేది స్పష్టమైంది. అందువల్ల ఇంత వరకు లభించిన మద్దతు కేసీఆర్ కు ఇప్పుడు లభించడం కష్టమే. 

ఏది అడిగినా...

సమస్యలపై, డిమాండ్లపై ఆందోళనలు చేపట్టలేని పరిస్థితి తెలంగాణలో ఏర్పడింది. హైదరాబాదులోని ధర్నా చౌక్ ను కూడా ఎత్తేయడానికి కేసీఆర్ సిద్దపడ్డారు. ఉద్యమ కాలంలో ఇటువంటి ధర్నా చౌక్ లు ఎత్తేసి, ఎక్కడికక్కడ అరెస్టులు చేసి ఉంటే తెలంగాణ ఉద్యమం ఏమై ఉండేదనే ప్రశ్న వస్తుంది. కానీ, తెలంగాణ సమాజం మొత్తం, అంటే అన్ని వర్గాల ప్రజానీకం అప్పటి ప్రభుత్వాలపై తిరగబడ్డాయి కాబట్టి అటువంటి అణచివేత ధోరణులు చేపట్టలేకపోయారు. అలాంటి అణచివేత చర్యలు చేపట్టి ఉంటే హింస ప్రజ్వరిల్లి ఉండేదనే విషయం కేసీఆర్ కు తెలియంది కాదు. 

అప్పటికే విద్యార్థుల, యువకుల ఆత్మహత్యలు సమాజాన్ని కల్లోలపరిచాయి. ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆత్మహత్యల తెలంగాణ పునరావృతం కావడాన్ని జీర్ణించుకోలేని స్థితి నెలకొని ఉంది. ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు, అన్ని రంగాల ప్రజలు ఏకమయ్యే పరిస్థితి వచ్చేసింది. అందుకు కేసీఆర్ విధానాలు మాత్రమే కారణమవుతాయి. 

యూటీ బ్యాచ్ లేదా గులాబీ ఓనర్లు...

ఆర్టీసీ సమ్మె సందర్భంగా యూటీ బ్యాచ్ అనేది కూడా చర్చలోకి వచ్చింది. ఉద్యమ నేతలెవరూ ఇప్పుడు చురుగ్గా లేరు. బయటి సమాజంలోనే కాదు, ప్రభుత్వంలో కూడా చురుగ్గా లేరు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ప్రస్తుత మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఆర్టీసీ సమ్మెపై పెదవి విప్పడం లేదు. 

ఆర్టీసీ సమ్మెపై స్పందించిన మంత్రులకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంతో సంబంధం లేదు. కొంత మంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించారు కూడా. ఎర్రబెల్లి దయాకర్ రావును మినహాయిస్తే (ఆయన కూడా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన టీడీపీలో ఉన్నారు) తలసాని శ్రీనివాస యాదవ్, సత్యవతి రాథోడ్ తదితరులు ఆ కోవలోకే వస్తారు. రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి పువ్వాడ అజయ్ మాట్లాడక తప్పని పరిస్థితి. 

హరీష్ రావు, ఈటల రాజేందర్ వంటి మంత్రులు నోరు విప్పడం లేదు. వారిద్దరు ఎందుకు మాట్లాడడం లేదని అశ్వత్థామ రెడ్డి ప్రశ్నించారు కూడా. కేటీఆర్ కూడా పెదవి విప్పలేదు. నిజానికి, ప్రభుత్వంలో కేటీఆర్ మాటనే చెల్లుబాటు అవుతుందనే అభిప్రాయం ఉంది. అటువంటి స్థితిలో కూడా కేటీఆర్ మాట్లాడడం లేదు. 

ఇదే సందర్భంలో ఈటల రాజేందర్ ముందుకు తెచ్చిన గులాబీ ఓనర్ల నినాదాన్ని గుర్తు చేసుకోవడం అసందర్భమేమీ కాదు. గులాబీ ఓనర్లు ఆర్టీసీ సమ్మె విషయంలో మౌనంగా ఉన్నారు. 

అశ్వాత్థామ రెడ్డి ధైర్యం ఏమిటి....

నిజానికి, సమ్మెకు దిగడమనేది సాహసోపేతమైన నిర్ణయమే. అయినప్పటికీ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, కార్మికులు అవాంఛనీయ సంఘటనలేవీ జరగలేదు. పైగా, కేసీఆర్ పదే పదే హెచ్చరికలు చేసినప్పటికీ, పువ్వాడ అజయ్ తో చేయించినప్పటికీ ఆర్టీసీ కార్మికులు ఉద్యోగాల్లో చేరుతున్న దాఖలాలు కనిపించడం లేదు. 

ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టినప్పటికీ భయపడిపోయి కార్మికులు ఉద్యోగాల్లో చేరిపోయిన దాఖలాలు ఏమీ లేవు. కేవలం 1200 మంది తిరిగి విధుల్లో చేరారు. కేసీఆర్ చెబుతున్న లెక్కల ప్రకారమే 48 వేల మంది విధులకు దూరంగా ఉన్నారు. వారందరూ వారంతట వారే డిస్మిస్ అయినట్లు కేసీఆర్ ప్రకటించారు. అయినప్పటికీ వారిలో ఆందోళన కనిపించిన దాఖలాలు లేవు. సమ్మె బాటలోనే కొనసాగుతున్నారు. 

పులి మీద స్వారీ చేస్తున్నామనే విషయం తమకు తెలుసునని అశ్వత్థామ రెడ్డి అన్నారు. అయితే, ఆ పులి మీద స్వారీ చేయడానికి కావాల్సిన దమ్మూ ధైర్యం ఆయనకు గానీ కార్మికిులకు గానీ ఎలా వచ్చిందనేది ప్రశ్న. పైగా, కేసీఆర్ కు తీవ్రమైన హెచ్చరికలు కూడా చేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రభుత్వమే కూలిపోయింది, కేసీఆర్ ప్రభుత్వమెంత అనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. దానికి తోడు, మంత్రులు కొంత మంది తమతో టచ్ లో ఉన్నారని కూడా చెప్పారు. 

ఈ సందర్భంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వ్యాఖ్యలను గుర్తు చేసుకోవాలి. సమ్మె వెనక తమ పార్టీ వాళ్లే ఉన్నారని ఆయన చెప్పారు. సమ్మె వెనక ఉన్న టీఆర్ఎస్ నేతలు ఎవరనేది ప్రశ్న. గులాబీ ఓనర్లు గానీ యూటీ బ్యాచ్ గానీ అయి ఉండదవచ్చునా అనేది ప్రశ్న. అవునని అనుకుంటే సమాధానం సులభంగానే దొరుకుతుంది.

అయితే, అర్టీసీ సమ్మెకు కొంత మంది టీఆర్ఎస్ నేతల అండదండలు మాత్రమే ఉన్నాయా, ఆర్టీసీ నాయకత్వం వెనక ఇంకేదైనా శక్తి ఉందా అనే ప్రశ్నలు కూడా వేసుకోవడం తప్పేమీ కాదు. ఈ సందర్భంగా మనం బిజెపి నేతలు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకోక తప్పదు. కర్ణాటక తర్వాత తమ లక్ష్యం తెలంగాణ అని మురళీధర రావు వంటి బిజెపి నేతలు చెబుతూ వస్తున్నారు. బిజెపి తన లక్ష్య సాధనలో తొలి అడుగు వేసి ఉండవచ్చునని అనుకోవచ్చు. ఆ తొలి అడుగు వేయడానికి వెసులుబాటు కల్పించింది కూడా కేసీఆర్ తప్ప మరెవరో కాదనే నిర్ధారణకు కూడా రావచ్చు. 

తమిళిసై అడుగులు...

తమిళిసై తెలంగాణలో చురుకైన పాత్ర పోషించడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు అర్థమవుతోంది. విశ్వవిద్యాలయాల ఇంచార్జీ వైస్ చాన్సలర్లతో భేటీ కావడం ఒక ఎత్తయితే, ఆర్టీసీ సమ్మె విషయంలో నేరుగా రంగంలోకి దిగడం మరో ఎత్తు. గవర్నర్ కు అధికారం ఉండవచ్చు గానీ, కేసీఆర్ ను పట్టించుకోనట్లుగా అజయ్ తో ఆమె మాట్లాడడాన్ని బట్టి పరిస్థితి ఎటు వైపు మళ్లుతుందనేది అర్థం చేసుకోవచ్చు.  

మరో వైపు, హైకోర్టు ఒత్తిడి కూడా పెరుగుతోంది. తాము ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమేనని అశ్వత్థామ రెడ్డి వ్యూహాత్మకంగా ప్రకటన చేశారు. ప్రభుత్వమే చర్చలకు సిద్దంగా లేదనే విషయాన్ని ఆయన హైకోర్టు దృష్టికి తద్వారా తీసుకుని వెళ్లినట్లయింది. అందువల్ల తప్పు ప్రభుత్వానిదే అవుతుంది తప్ప కార్మికులది కాదని అనుకోవడానికి వీలు కలుగుతుంది. ఆర్టీసీకి ఎండీని నియమించలేని పరిస్థితిని హైకోర్టు ప్రశ్నిస్తూనే ఉంది. 

మొత్తం మీద, కేసీఆర్ స్వయంకృతపరాధం కొంప ముంచేట్లే కనిపిస్తోంది. ఇదే సమయంలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుందనే అశ్వత్థామ రెడ్డి మాటలను కూడా గుర్తు చేసుకోవాలి.

click me!