Nov 13, 2022, 10:33 AM IST
పెద్దపల్లి : టీఆర్ఎస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేసారు. ఎన్నికల సమయంలో పెద్దపల్లికి వచ్చిన కేసీఆర్ మనోహర్ రెడ్డి దగ్గర మంచిగ పైసలున్నాయి కాబట్టి అవినీతి చేయడని అన్నాడటగా... ప్రభుత్వం నుండి వచ్చే నిధులే కాదు జేబులోంచి డబ్బులు పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ది చేసుకుంటాడు కాబట్టి ఆయనను గెలిపించాలని కోరాడటగా అని పెద్దపల్లి ప్రజలను షర్మిల అడిగారు. కేసీఆర్ మాటలు నమ్మి మనోహర్ రెడ్డిని గెలిపిస్తే ప్రజలకు పైసలు పెట్టడంమాట అటుంచి వారినుండే పైసలు గుంజుకుంటున్నాడని ఆరోపించారు.
పెద్దపల్లి ఎమ్మెల్యే ఎంతకు దిగజారాడంటే చివరకు అగ్రికల్చర్ గోదాం రేకులు లాక్కొని తన క్యాంప్ ఆఫీస్ కట్టుకోవాలని చూశాడని షర్మిల తెలిపారు. దీంతో ఈయనెంత కక్కుర్తి ఎమ్మెల్యేనో దేశమంతా తెలిసింది... ఇలా చేయడానికి కాస్తయినా సిగ్గుండాలి కదా అంటూ మండిపడ్డారు. దేవాలయాలు, అసైన్డ్, దళితుల భూముల కబ్జా, మానేరులో ఇసుక అక్రమ రవాణా, చివరకు మట్టి... ఇలా దేన్నీ వదలడం లేడటగా మీ ఎమ్మెల్యే అని అడిగారు. ఎమ్మెల్యేకు చెందిన విద్యాసంస్థల ఫీజులు ముక్కుపిండి వసూలు చేస్తారటగా... అంటూ పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై షర్మిల తీవ్ర ఆరోపణలు చేసారు.