Nov 17, 2022, 11:09 AM IST
కరీంనగర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన గాలికొదిలి సినిమాలు రిలీజ్ చేయడంపై దృష్టిపెట్టారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల ఎద్దేవా చేసారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనాలని బిజెపి చూస్తోందంటూ 'నాలుగు స్తంభాలాట', నిన్న 'కంటే కూతుర్నే కనాలి' అనే సినిమాకు ట్రైలర్ రిలీజ్ చేసారంటూ సెటైర్లు వేసారు. తన కూతురు కల్వకుంట్ల కవితను కూడా బిజెపి కొనాలని చూస్తోందని... కానీ నా కూతురు అమ్ముడుపోకపోవడంతో కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తోందని కొత్త కథ అల్లాడన్నారు. కవిత లిక్కర్ స్కామ్ నుండి బయటపడేయాలని కేసీఆర్ ప్రయత్నించాడు... అది సాధ్యంకాక పోవడంతో ఇక అరెస్టులు, కేసులు తప్పవని అర్థమై కొత్త సినిమాకు తెరతీస్తున్నాడన్నారు. నిజంగానే బిజెపి కవితను కొనాలని చూస్తే నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు సమయంలోనే కేసీఆర్ భయటపెట్టేవాడు... అది నిజమైతేగా చెప్పడానికి అంటూ కేసీఆర్ ను షర్మిల నిలదీసింది.
కేసీఆర్ ఏది చెబితే అది నమ్మడానికి తెలంగాణ ప్రజలేమీ గొర్రెలు కాదని షర్మిల అన్నారు. కేసీఆర్ చెప్పేదాంట్లో ఏమయినా సోయి వుందా... ఏదయినా అర్థం వుందా అంటూ మండిపడ్డారు.
అతికేలా అబద్దాలు ఆడాలనే ఇంగితం కూడా కేసీఆర్ కు లేదని... చివరకు ప్రజలు ఉమ్మేసే పరిస్థితికి వచ్చాడని షర్మిల విమర్శించారు.