హైదరాబాద్ శివారులో ఘోరం... ఒంటరి యువతిపైకి దూసుకెళ్లిన కారు, పరిస్థితి విషమం

Jul 7, 2022, 3:00 PM IST

హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారులో ఘోరం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ పరిధిలోని చింతల్ మెట్ హకీం హిల్స్ కాలనీలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న యువతిని కారు ఢీకొట్టింది. వేగంగా వచ్చిన కారు ఒంటరిగా రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళుతున్న యువతిపైకి దూసుకెళ్లిన వీడియో కాలనీలోని సిసి కెమెరాల్లో రికార్డయ్యింది. కారును రివర్స్ చేసుకుని వచ్చిమరీ యువతిని ఢీకొట్టి ఆపకుండా అదే వేగంతో పరారయ్యారు. యాక్సిడెంట్ జరిగిన విధానం చూస్తుంటే ఉద్దేశపూర్వకంగానే యువతిని కారుతో ఢీకొట్టినట్లు అనుమానం కలుగుతోంది. 

కారు ఢీకొట్టడంతో యువతి అమాంతం ఎగిరి  ఓ ఇంటిఎదురుగా పడిపోయింది. ఇలా రక్తపుమడుగులో పడివున్న యువతిని స్థానికులు హుటాహుటిన దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందో స్పష్టంగా సిసి కెమెరాల్లో రికార్డయినా బాధిత యువతి కుటుంబసభ్యులు ఎలాంటి అనుమానం వ్యక్తంచేయకుండా రోడ్డుప్రమాదంగానే ఫిర్యాదు చేయగా పోలీసులు కూడా అలాగే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది పలు అనుమానాలకు దారితీస్తుంది.