Sep 7, 2022, 1:04 PM IST
పెద్దపల్లి : వారిద్దరి మతాలు వేరు.. కానీ ప్రేమ వారిని కలిపింది. పెద్దల్ని ఎదురించి మరీ పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ ఆటోనగర్ కు చెందిన అజీమ్ ఖాన్ పదేళ్ల క్రితం తన కాలనీకే చెందిన శ్రావణిని ఎంతగానో ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. కానీ ఆర్థిక సమస్యలు వారిద్దరి మధ్య చిచ్చుపెట్టాయి. భార్య భర్తల మధ్య ఇటీవల కాలంలో గొడవలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇబ్బందులు భరించలేని శ్రావణి షాపింగ్ మాల్ లో సేల్స్ గర్ల్ గా పని చేస్తుంది. మంగళవారం ఉదయం ఇరువురి మధ్య గొడవ జరగడంతో భర్త అజీం ఖాన్ పై శ్రావణి, ఆమె తల్లి నర్మదలు దాడి చేసి గొంతు నులిమి చంపేసినట్లు స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలాన్ని ఎన్టీపీసీ ఎస్సై జీవన్ పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. అయితే తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవని, ఇదే క్రమంలో తన అక్క శ్రావణిని గతంలో బావ కత్తితో చంపే ప్రయత్నం చేశాడని మృతుని మరదలు చెప్పుకొచ్చింది.