అగ్నిప్ర‌మాద బాధితుల‌ను ఆదుకుంటాం - హోంమంత్రి మహమూద్ అలీ

Mar 23, 2022, 3:54 PM IST

టింబ‌ర్ డిపో అగ్నిప్ర‌మాద బాధితుల‌ను ప్ర‌భుత్వం త‌రుఫున ఆదుకుంటామ‌ని తెలంగాణ హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ (Telangana  Home Minister Mahmood Ali) అన్నారు. ఈ ప్ర‌మాదంపై ఆయ‌న తీవ్ర ద్రిగ్భాంతిని వ్య‌క్తం చేశారు. బుధ‌వారం ఆయ‌న సికింద్రాబాద్ (Secunderabad)లోని బోయిగూడ టింబర్‌ డిపో (Timber Depot) అగ్ని ప్ర‌మాద స్థ‌లాన్ని ప‌రిశీలించారు. 

ఈ అగ్ని ప్ర‌మాదంలో పలువురు చ‌నిపోవ‌డం ప‌ట్ల హోం మంత్రి త‌న ప్ర‌గాఢ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఈ దుర్ఘటనపై త‌న‌కు చెప్పలేనంత బాధ కలిగిందని అన్నారు. సీఎం కేసీఆర్ ఈ ప్ర‌మాదంలో మృతి చెందిన వారి కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించార‌ని తెలిపారు. మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని డీజీ, అగ్నిమాపక శాఖ, ఇతర అధికారులను ఆయ‌న ఆదేశించారు. క్ష‌త‌గాత్రులు త్వ‌ర‌గా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు.

బోయిగుడాలోని ఈ టింబ‌ర్ డిపోలో చోటు చేసుకున్న అగ్రి ప్ర‌మాదంలో దాదాపు 11 మంది స‌జీవ ద‌హ‌నం అయ్యారు. ఇందులో చనిపోయిన వారిని రాజేష్, బిట్టు, సికిందర్, దామోదర్, సత్యేందర్, దినేష్, రాజు, దీపక్, పంకజ్, దినేష్, చింటులుగా పోలీసులు గుర్తించారు. వీరంతా నిద్ర‌లో ఉన్న‌ప్పుడే ప్ర‌మాదం జ‌రిగింది.