మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్ ... రాజీనామా చేయాలంటూ నిలదీసిన యువకులు

Nov 7, 2022, 2:08 PM IST

కరీంనగర్ :  ఉపఎన్నిక నేపథ్యంలో మునుగోడులో ప్రభుత్వం శరవేగంగా అభివృద్ది పనులు చేయడం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చిక్కులు తెచ్చిపెట్టింది. తమ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఉపఎన్నికలో గెలుపుకోసమైనా అధికార పార్టీ మునుగోడులో మాదిరిగా అభివృద్ది పనులు చేస్తుందని ప్రజలు భావిస్తున్నారు. దీంతో తమ నియోజకవర్గాల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి రాజీనామాలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి చేదు అనుభవమే మానుకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు ఎదురయ్యింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి తన నియోజకవర్గ పరిధిలో పర్యటనకు వెళ్లగా గన్నేరువరం గ్రామస్తులు అడ్డుకున్నారు. కొందరు యువకులు ఎమ్మెల్యేను ఆపి ఆధ్వాన్నంగా మారిన రోడ్డు గురించి, డబుల్ బెడ్రూం ఇళ్లు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం గురించి ప్రశ్నించారు. సొంత నియోజకవర్గం అభివృద్ది చేతకాదు గానీ మునుగోడులో హామీలివ్వడం ఏమిటంటూ మండిపడ్డారు. వెంటనే రాజీనామా చేయాలని... తద్వారా వచ్చే ఉపఎన్నిక కోసమైన ప్రభుత్వం అభివృద్ది చేస్తుందని యువకులు సూచించారు. ఇలా గ్రామస్తులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయడంతో కారెక్కి జారుకున్నారు ఎమ్మెల్యే రసమయి.