బిజెపి మార్క్ పాలిటిక్స్... జూ.ఎన్టీఆర్ తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ

Aug 22, 2022, 12:15 PM IST

హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్నటి (ఆదివారం) తెలంగాణ పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నందమూరి కుటుంబానికి చెందిన యంగ్ ఆండ్ వెరీ టాలెంటెడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా ప్రత్యేకంగా భేటీఅయ్యారు. మునుగోడు బహిరంగ సభ తర్వాత హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర హోంమంత్రి నోవాటెల్ హోటల్లో జూ. ఎన్టీఆర్ ను కలిసారు. బిజెపి సీనియర్లతో పాటు ఎన్టీఆర్ తో కలిసి అమిత్ షా విందు చేసారు. అమిత్ షాతో జూ.ఎన్టీఆర్ భేటీ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే వీరి భేటీలో ఎలాంటి రాజకీయ కోణం లేదని... సినిమాల గురించే ఎన్టీఆర్ తో షా చర్చించినట్లు తెలుస్తోంది. నోవాటెల్ కు చేరుకున్న జూ.ఎన్టీఆర్ కు కేంద్ర పర్యాటక శాఖమంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. తానే దగ్గరుండి ఎన్టీఆర్ ను అమిత్ షా వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అమిత్ షా కు ఎన్టీఆర్ పుష్ఫగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు. అమిత్ షా కూడా ఎన్టీఆర్ కు పుష్పగుచ్చం ఇచ్చారు. ఇద్దరూ దాదాపు అరగంటకు పైగా భేటీ అయ్యారు.