గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : 100 ఏళ్ల నాటి భారీ వృక్షాల తరలింపు (వీడియో)

Apr 17, 2022, 4:17 PM IST

టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. ఇప్పటి  వరకు ఈ కార్యక్రమంలో భాగంగా సెలబ్రెటీలు, ప్రముఖులు చెట్లు నాటుతూ వచ్చారు. అయితే ఇక్కడ మాత్రం 100 ఏళ్ల నాటి చెట్లను కొట్టేయకుండా మరో చోటికి తరలించారు. పట్టణంలో ప్రస్తుతం వున్న రోడ్లు, భవనాల శాఖ గెస్ట్‌హౌస్‌లో జిల్లా యంత్రాంగం సమీకృత మాంసం, కూరగాయాల మార్కెట్‌ను నిర్మిస్తోంది. అయితే ఆ ప్రాంగణంలో దాదాపు 100 ఏళ్లకు పైబడిన నాలుగు చెట్లు వున్నాయి. 

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం హరితహారానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో.. జిల్లా యంత్రాంగం గ్రీన్ ఇండియా ఛాలెంజ్, ఇతర సంస్థల సహకారంతో నాలుగు చెట్లను పట్టణ శివార్లలోని కేసీఆర్ అర్బన్ ఏకో పార్కుకు తరలించింది. తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్ (v srinivas goud) ఆదివారం చెట్ల ట్రాన్స్‌లోకేషన్ ఎక్సర్‌సైజ్ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెట్ల తరలింపులో కీలకపాత్ర పోషించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్ రావు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్, వాటా ఫౌండేషన్, పబ్లిక్ హెల్త్ ఈఈ విజయ భాస్కర్, ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది కృషిని మంత్రి అభినందించారు. 

మరోవైపు.. చెట్లను నరకకుండా, తరలిస్తున్న జిల్లా యంత్రాంగం కృషికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్ కుమార్ ట్రాన్స్‌లేషన్‌ కార్యక్రమాన్ని సుసాధ్యం చేసేందుకు చేస్తున్న కృషిని అభినందించారు. ఎలాంటి నష్టం జరగకుండా చెట్లను మార్చామని.. ఇందుకు చేసిన కసరత్తు విజయవంతమైందని అధికారులు పేర్కొన్నారు.