Dec 1, 2022, 11:54 AM IST
హైదరాబాద్ : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో రాష్ట్ర రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ సతీష్ రెడ్డి ఫిర్యాదు చేసారు. తెలంగాణ ప్రాంతాన్ని, ఇక్కడి ప్రజలను అవమానించేలా అహంకారపూరితంగా మాట్లాడుతున్న షర్మిలపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ వనస్థలిపురం ఏసిపిని కోరారు సతీష్ రెడ్డి. షర్మిల మాటలు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. తెలంగాణ ప్రాంతాన్ని అప్ఘానిస్తాన్, పాకిస్తాన్ తో పోలుస్తూ... ఉద్యమకారులు, నాయకులను ఉగ్రవాదులు, తాలిబాన్లతో పోలుస్తూ షర్మిల అవమానిస్తున్నారని సతీష్ రెడ్డి అన్నారు. గతంలో ఏపీలో పాదయాత్ర చేపట్టిన షర్మిల తెలంగాణ ఉద్యమాన్ని ఉగ్రవాదంతో పోల్చారని... ఇప్పుడేమో ఇక్కడి ప్రజలపై ప్రేమ వున్నట్లు నటిస్తున్నారని అన్నారు. తన అక్రమాస్తులను కాపాడుకోవడం, రాజకీయ పబ్బం గడుపుకోడానికే బిజెపితో కుమ్మక్కయి షర్మిల నీచ రాజకీయాలు చేస్తోందని సతీష్ రెడ్డి మండిపడ్డారు.