Nov 7, 2022, 2:50 PM IST
నిజామాబాద్ : కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ పట్టణంలోని నీలకంఠేశ్వర స్వామిని ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. స్థానిక మహిళలతో కలిసి ఆలయానికి చేరుకున్న కవిత స్వామివారి దర్శనం అనంతరం దీపారాధన చేసారు. ఆ పరమశివుడి ఆశిస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో వుండాలని కోరుకున్నానని అన్నారు. ఇక ఆలయ కమిటీ అభ్యర్ధన మేరకు రూ.50లక్షలతో రథాన్ని ఏర్పాటుచేసి ఇవ్వనున్నట్లు కవిత తెలిపారు. ఈ సందర్భంగా మునుగోడు గెలుపు గురించి కవిత మాట్లాడుతూ... టీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు అండగా నిలిచిన మునుగోడు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. అవాకులు చవాకులు పేలే బిజెపి నాయకులకు మునుగోడు ప్రజలు సరయిన సమాధానం చెప్పారన్నారు. ఈ విజయపరంపర ఇలాగే కొనసాగుతుందని... ఏ ఎన్నికలొచ్చినా ప్రజల విశ్వాసం టీఆర్ఎస్ పైనే వుంటుందని కవిత అన్నారు.